సీత బాటలోనే ద్రౌపది : భాజపా కరుణతో సభా ప్రవేశం

Update: 2016-10-04 12:03 GMT

‘టీవీ సీత’ రాజకీయ రంగప్రవేశం చేసినట్లుగానే ‘టీవీ ద్రౌపది’ కూడా ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. భారతీయ జనతా పార్టీ.. దేశవ్యాప్తంగా హిందీ లో వచ్చిన ప్రఖ్యాత సీరియల్స్ లో ప్రముఖ భూమికలను పోషించిన నాయికలకు పార్లమెంటు సభా అవకాశం కల్పించడం అలవాటుగా చేసుకున్నదా అనిపించేలా ఆమె రాజ్యసభలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఒకవైపు మోదీ హవా, పరిపాలనలో విలక్షణత ఇలాంటి అంశాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూనే.. ప్రజల ద్రుష్టిలో సెలబ్రటీలుగా ఉన్న , టీవీ సినీగ్లామర్ కు కూడా ప్రాధాన్యం ఇచ్చే ద్విముఖ వ్యూహాన్ని భాజపా అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

1990 వ సంవత్సరాల్లో దూరదర్శన్ లో ప్రసారం అయిన మహాభారత్ సీరియల్ ఎంత ఖ్యాతిగాంచిందో అందరికీ తెలుసు. దానికంటె ముందు వచ్చిన రామాయణ్ తరువాత.. అంతే సమానంగా దేశాన్ని ఉర్రూత లూగించిన సీరియల్ అదే. ఆ సీరియల్ లో రూపా గంగూలీ ద్రౌపది పాత్రను పోషించారు. సహజంగానే ఆమె పాత్ర దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది.

యాద్రుచ్ఛికమే కావచ్చు గానీ.. హైందవ పురాణాలు ఇతిహాస నాయకులను తమ ప్రచార ఎలిమెంట్లుగా వాడుకుంటూ.. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉండే భారతీయ జనతా పార్టీ ఈ ద్రౌపదిని కూడా అక్కున చేర్చుకుంది. గత ఏడాది రూపా గంగూలీ భాజపాలో చేరారు. పశ్చిమ బెంగాల్ లో భాజపా మహిళా అధ్యక్షురాలిగా ఆమె పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా నార్త్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆమె ఓడిపోయారు. కానీ మోదీకి మాత్రం ఇలాంటి సెలబ్రిటీ మహిళా నాయకులు ప్రజాదరణ పొందలేకపోవడంతో అసలు నిమిత్తం లేదు అని మరో సారి నిరూపణ అయింది.

అమేథీలో ఓడిపోయిన మరొక టీవీ నటి స్మ్రుతి ఇరానీ ని రాజ్యసభ సభ్యురాలిని చేసి కేంద్రమంత్రిగా ప్రోత్సహిస్తున్న మోదీ, ఇప్పుడు ఆమె బాటలోనే ‘టీవీ ద్రౌపది’ రూపా గంగూలీని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. అలాగే ‘టీవీ సీత’గా గుర్తింపు ఉన్న దీపికా చికిలియా కూడా గతంలో భాజపా నుంచి ఎంపీగా పోటీచేసిన వారే. మొత్తానికి సీత- ద్రౌపది ఇద్దరూ భాజపా తరఫున నాయకురాళ్లుగా చెలామణీ లోకి వస్తున్నారన్నమాట.

Similar News