‘‘సీట్లు’’ అంతా ఇప్పుడు ‘‘షా’’ చేతిలోనే... తేల్చేస్తారా....!

Update: 2018-01-31 12:30 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నడుంబిగించారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. ఏపీలో 175 నుంచి 225 వరకూ, తెలంగాణలో 119 నుంచి 153 వరకూ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీనిపై ఇప్పటికే హోంశాఖ కసరత్తు చేసింది. నోట్ కూడా తయారు చేసి ప్రధాని కార్యాలయానికి పంపింది. ప్రధాని కార్యాలయం ఓకే చేస్తే కేబినెట్ ముందుకు వస్తుంది. తర్వాత పార్లమెంటులో దీనిని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు నియోజకవర్గాల పెంపు చేయాలని ప్రధాని మోడీని పలు దఫాలు కోరారు. అయినా ఫలితం లేదు.

రేపు బీజేపీ నేతలతో సమావేశం....

అయితే తాజాగా అమిత్ షా రంగంలోకి దిగారు. అమిత్ షా తొలుత తమ పార్టీకి చెందిన రెండు రాష్ట్రాల నేతలతో సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, శాసనసభ పక్ష నేతలు గురువారం తనను కలవాల్సిందిగా అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. దీంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, విష్ణుకుమార్ రాజులు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు అమిత్ షా తో వారి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపుపై అమిత్ షా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

టిబీజేపీనేతలు వ్యతిరేకం....

అయితే తెలంగాణ బీజేపీ నేతలు తొలి నుంచి సీట్ల పెంపును వ్యతిరేకిస్తున్నారు. సీట్లను పెంచితే టీఆర్ఎస్ మరింత బలపడే అవకాశముందని, పార్టీలో చేరికలు మరింత పెరుగుతాయని వారు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఎంఐఎం కూడా బలం పెంచుకునే అవకాశముందని చెబుతున్నారు. సిటీలో మరిన్ని సీట్లు పెరిగితే అది ఎంఐఎంకు అనుకూలమని వారు ఎప్పటినుంచో చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగకుండానే ఎన్నికలకు వెళ్లాలన్నది తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగానే అమిత్ షాను కోరనున్నారు. అయితే ఆంధ్ర బీజేపీ నేతలు మాత్రం సీట్ల పెంపునకు సుముఖంగా ఉన్నారు. సీట్లు పెరిగితే ఏపీలో తమ వాటా పెరుగుతుందన్నది వారి ఆలోచన.

విభజన హామీలపై కూడా....

అయితే అమిత్ షా సమావేశంలో సీట్ల పెంపుతో పాటు విభజన హామీలపై కూడా చర్చించే అవకాశముంది. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ విషయంపై ఏపీ బీజేపీ నేతలు పట్టుబట్టనున్నారు. విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించకపోతే ఏపీ ప్రజలు నమ్మరని అమిత్ షా దృష్టికి తేనున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇచ్చినందున ఏపీ ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని, విశాఖ రైల్వే జోన్ తో పాటు పోలవరం పనులను కూడా వేగవంతం చేస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని వారు అమిత్ షాకు చెప్పనున్నారు. మొత్తం మీద రేపు జరిగే సమావేశంలో అమిత్ షా సీట్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాహుంది. తర్వాత టీఆర్ఎస్, టీడీపీ నేతలతో కూడా ఆయన సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News