సీటు మార్చ‌మ‌న్న అంబ‌టి... అక్క‌డ పోటీ చేయ‌మ‌న్న జ‌గ‌న్‌..!

Update: 2018-02-03 12:30 GMT

వైసీపీలో కాస్త నోరున్న లీడ‌ర్ల‌లో మాజీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఒక‌రు. గ‌తంలో టీడీపీ వాళ్లు ఎవ‌రైనా జ‌గ‌న్ మీద చిన్న విమ‌ర్శ చేసినా అంబ‌టి అస్స‌లు స‌హించే వారు కాదు. గ‌త ఎన్నిక‌ల్లో స‌త్తెన‌పల్లి నుంచి పోటీ చేసిన అంబ‌టి రాంబాబు అక్క‌డ అనూహ్యంగా కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు పోటీకి దిగ‌డంతో గ‌ట్టి ఫైట్ ఇచ్చి 713 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత అంబ‌టి దూకుడు ఎక్కువ‌వ్వ‌డంతో జ‌గ‌న్ వార్నింగ్‌తో ఆయ‌న కాస్త మాట‌ల వాడి వేడి త‌గ్గించార‌న్న టాక్ కూడా ఉంది.

సత్తెనపల్లిపై అంబటి....

ఇక వైసీపీలో విన‌ప‌డుతోన్న తాజా స‌మాచారం ప్ర‌కారం అంబ‌టి రాంబాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేసేందుకు అయిష్టంగానే ఉన్నార‌ని తెలుస్తోంది. స‌త్తెన‌ప‌ల్లికి పూర్తిగా నాన్‌లోక‌ల్ అయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ పోటీ చేసినా కోడెల చేతిలో ఓడిపోయారు. ఇక ఇప్పుడు అక్క‌డ నుంచి మారాల‌నుకుంటోన్న అంబ‌టి జ‌గ‌న్‌తో త‌న‌కు గుంటూరు వెస్ట్ సీటు ఇవ్వాల‌ని అడిగార‌ని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన లేళ్ల అప్పిరెడ్డిని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశారు. దీంతో వెస్ట్ సీటు నుంచి పోటీ చేసేందుకు చాలా మంది రేసులో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే అంబ‌టి క‌న్ను ఇక్క‌డ ప‌డింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గంతో పాటు కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. ఎంపీ సీటు క‌మ్మ వ‌ర్గానికి చెందిన లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులుకు ఇవ్వ‌డంతో అంబ‌టి ఈ సీటును త‌న‌కు కావాల‌ని జ‌గ‌న్‌ను అడిగిన‌ట్టు తెలుస్తోంది. క‌మ్మ‌+కాపు వ్యూహంతో ఇక్క‌డ గెల‌వ‌వ‌చ్చ‌న్న‌దే అంబ‌టి ప్లాన్‌.

రేప‌ల్లెకు వెళ్ల‌మ‌న్న జ‌గ‌న్....

అంబ‌టి స‌త్తెన‌ప‌ల్లి నుంచి గుంటూరు వెస్ట్‌కు రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటే జ‌గ‌న్ మాత్రం ఈ హాట్ సీటును అంబ‌టికి ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ సీటుపై పార్టీతో పాటు కొంద‌రు త‌ట‌స్థ నాయ‌కులు కూడా క‌న్నేశారు. దీంతో జ‌గ‌న్ అంబ‌టిని రేప‌ల్లె వెళ్లి పోటీచేయ‌మ‌న్న‌ట్టు మ్యాట‌ర్ లీక్ అయ్యింది. అంబ‌టి గ‌తంలో రేప‌ల్లెలో 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో అక్క‌డ గెలిచిన అంబ‌టి 1994, 1999 రెండుసార్లు ఓడిపోయారు. ఇక ఇప్పుడు తిరిగి జ‌గ‌న్ అంబ‌టిని అక్క‌డే పోటీ చేయ‌మ‌న్న‌ట్టు జిల్లా వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. మ‌రి జ‌గ‌న్ ఆప్ష‌న్‌కు అంబ‌టి ఏం చేస్తారో చూడాలి.

Similar News