సీఎం రమేష్ కు చుక్కలు కనపడుతున్నాయ్

Update: 2017-10-21 10:30 GMT

సీఎం రమేష్ కు అధినేత చుక్కలు చూపిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఆయనకు అపాయింట్ మెంట్ దొరకడం లేదు. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత సీఎం రమేష్ అనేకసార్లు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయనకు అపాయింట్ మెంట్ దొరకడం లేదని తెలుస్తోంది. సీఎం రమేష్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారన్న టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. సీఎం రమేష్ వల్ల జిల్లాలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందన్న అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు తెలిసింది. సీఎం రమేష్ గత కొన్నేళ్లుగా కడప జిల్లా రాజకీయాల్లో సీఎం రమేష్ చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం రమేష్ ప్రాధాన్యత తగ్గించాలని టీడీపీ అధినేత నిర్ణయానికి వచ్చారు. సీఎం రమేష్ పై కడప, అనంతపురం జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు. కాంట్రాక్టులు తీసుకుని సకాలంలో పూర్తి చేయడమే కాకుండా అదేమని అడిగితే తమను కూడా పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. హంద్రీనీవా, గడికోట, తాడిపత్రి-గుత్తి రహదారి వంటి పనులు ఇంకా మందకొడిగానే నడుస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సీఎం రెండు నెలల క్రితం రమేష్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయనను పక్కన పెట్టారని పార్టీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.

సీఎం అపాయింట్ మెంట్ దొరకక.....

అయితే సీఎం రమేష్ పార్టీలో తన ఆధిపత్యానికి తానే గండి వేసుకున్నట్లయింది. సీఎం రమేష్ కడప జిల్లాలో ఎంత చెబితే అంత. దీంతో రమేష్ జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా వైసీపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారు. సీఎం రమేష్ పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదటే ఆది పార్టీలోకి వచ్చారు. దీనిపై జమ్మలమడుగు కు చెంది మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అనుచరులు సీఎం రమేష్ పై దాడికి కూడా యత్నించారు. అయితే ఇప్పుడు అదే ఆదినారాయణ సీఎం రమేష్ పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన వారిలో ముందున్నారు. గండికోట పనులు సక్రమంగా చేయడం లేదని సీఎం రమేష్ పై మంత్రి ఆది ఫిర్యాదు చేశారు. దీనిపై ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో కూడా అధికారులను మంత్రి ఆదినారాయణ రెడ్డి హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో సీఎం రమేష్ కు, మంత్రి ఆదినారాయణ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ముఖ్యమంత్రి కూడా మంత్రి ఆదిపక్షానే నిలిచినట్లు తెలిసింది. కాంట్రాక్టులు తీసుకున్నప్పుడు సకాలంలో పూర్తి చేయకుంటే ఎందుకని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. పోలవరం కాంట్రాక్టు పనుల నుంచి ట్రాన్స్ ట్రాయ్ ను తప్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారట. సీఎం రమేష్ కు అప్పగించిన అన్ని ప్రాజెక్టులపై రివ్యూ చేసి విదేశాల నుంచి వచ్చిన వెంటనే తనకు రిపోర్ట్ ఇవ్వాలని మంత్రి దేవినేని ఉమను ఆదేశించి చంద్రబాబు వెళ్లారు. దీంతో సీఎం రమేష్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈసారి ఎలాగైనా ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సీఎం రమేష్ కు చంద్రబాబు ఝలక్ ఇస్తారంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Similar News