కడప జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశంలో ఈ పరిణామాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దంపుడుతున్నాయి. మైదుకూరు నియోజకవర్గంలో జరిగిన ఒక సభలో సీఎం రమేష్ కాలం చెల్లిన వారికి, కురువృద్ధులకు టిక్కెట్లు ఉండబోవంటూ వ్యాఖ్యానించారు. కడప జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఇలాంటి నేతలు ఉన్నారని రమేష్ వ్యాఖ్యానించడం పార్టీలో కలకలం రేపింది. సీనియర్ నేతలను పక్కన పెట్టడమే సీఎం రమేష్ ఆలోచనగా కన్పిస్తుంది. దీనిపై జిల్లా వ్యాప్తంగా టీడీపీలో చర్చ నడుస్తోంది. ఇంతకీ సీఎం రమేష్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారంటే... ఆ నాలుగు నియోజకవర్గాలు... మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు నియోజకవర్గాల టీడీపీ నేతలను ఉద్దేశించిందేనంటున్నారు. కడప జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహు నాయకత్వం ఉంది. వర్గ పోరు తీవ్రంగా ఉంది. వీటన్నింటినీ పరిష్కరించాల్సింది పోయి సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయిందని టీడీపీ వర్గాలే బహిరంగంగా చర్చించుకుంటున్నాయి.
డీఎల్ కు వ్యతిరేకంగా రమేష్ వ్యాఖ్యలు.....
మైదుకూరు నియోజకవర్గంలో జరిగిన సభలో సీఎం రమేష్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గాన్ని 30 ఏళ్లుగా ఇద్దరు నేతలు ఏమీ చేయలేదన్నారు. వారు కురువృద్ధులని, వారి వల్ల కాదని సీఎం రమేష్ అన్నారు. వారిద్దరూ ఒకరు డీఎల్ రవీంద్రారెడ్డి కాగా, రెండో వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. రఘురామిరెడ్డి ఎటూ వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని అధినేత ప్రయత్నిస్తుంటే సీఎం రమేష్ మాత్రం డీఎల్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంటే డీఎల్ టీడీపీలోకి రావడం సీఎం రమేష్ కు ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇక రెండో నియోజకవర్గం ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరులో కూడా ఒక కురువృద్ధుడున్నాడని రమేష్ చేసిన వ్యాఖ్యలు వరదరాజులురెడ్డిని ఉద్దేశించే. గత ఎన్నికలకు ముందు వరదరాజులు రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి టిక్కెట్ సంపాదించుకోగాలిగారు. వరదరాజులు రెడ్డికోసం పార్టీ నేత లింగారెడ్డిని కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి సీఎం రమేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రమేష్ వరదరాజులు రెడ్డిని టార్గెట్ చేసినట్లు తెలిసింది. జమ్మలమడుగులోనూ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి, సీఎం రమేష్ కు పడటం లేదు. కొంతకాలం క్రితం జమ్మలమడుగు సమావేశానికి వెళ్లిన సీఎం రమేష్ పై రామసుబ్బారెడ్డి వర్గీయులు దాడి చేసినంత పనిచేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రధాన కారణం సీఎం రమేష్. అందువల్లనే వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆదినారాయణరెడ్డికి టిక్కెట్ వస్తుందని పరోక్షంగా సీఎం రమేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక బద్వేలు టీడీపీలో మూడు గ్రూపులున్నాయి. టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న విజయమ్మ, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయిన విజయజ్యోతి, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే జయరాములు. వీరు మూడు వర్గాలుగా విడిపోయి వారి అనుచరులకు చివరకు రాజీనామా వరకు వెళ్లారు. ఈ నియోజకవర్గంలో విజయమ్మను ఉద్దేశించే సీఎం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. మొత్తం మీద సీఎం రమేష్ వ్యాఖ్యలు కడప టీడీపీలో అంతర్గతంగా విభేదాలు బయటపెట్టినట్లయింది. సీఎం రమేష్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు.