సీఎం రమేష్ అక్కడ కూర్చున్నదెందుకు?

Update: 2018-02-07 07:30 GMT

అవును. ఏపీ ప‌క్షాన రాజ్య‌స‌భ‌లో స‌రైన గ‌ళం వినిపించ‌డంలో టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, సీనియ‌ర్ పొలిటీషియ‌న్ సీఎం ర‌మేష్ విఫ‌ల‌మ‌య్యార‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌క‌పోవ డం, విభ‌జ‌న చ‌ట్టం హామీల అమ‌లులో తీవ్ర నిరాస‌క్త‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాకుండా ఏపీ అనే రాష్ట్రం ఒక‌టి ఉంద‌ని కూడా ప‌ట్టించుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి త‌గిన విధంగా బుద్ధి చెప్పాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావించారు. దీనికి ఆయ‌న పార్ల‌మెంటు స‌మావేశాల‌ను వేదిక‌గా చేసుకున్నారు. ఇప్ప‌టికే అనేక సార్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అప్పాయింట్ మెంట్ అడిగినా ప్ర‌యోజనం క‌నిపించ‌క‌పోవ‌డం, ఇచ్చినా.. ఏపీ గురించి ప‌ట్టించు కోక‌పోవ‌డం నేప‌థ్యంలో విసిగిపోయిన చంద్ర‌బాబు పార్ల‌మెంటు వేదిక‌గానే కేంద్రంపై వేడి పెంచాల‌ని నిర్ణ‌యించారు.

కేంద్రం మెడలు వంచాలని....

దీనికి ఆయ‌న ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తికి ధ‌న్య‌వాదాలు చెప్పే.. స‌మావేశాల‌ను ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం వినియోగించు కోవాల‌ని కూడా భావించారు. రెండు రోజుల కింద‌ట ఏపీలో టీడీపీ ఎంపీల‌ను చంద్ర‌బాబు స‌మావేశ ప‌రిచారు. కేంద్రంపై ఎలా వ్య‌వ‌హ‌రించాలో? ఎలా ఒత్తిడి తీసుకురావాలో? ఏయే స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా ప‌ట్టుబ‌ట్టాలో పూస గుచ్చిన‌ట్టు స‌వివ‌రంగా వివ‌రించారు. అటు రాజ్య‌స‌భ‌లోను, ఇటు లోక్‌స‌భ‌లోను కూడా కేంద్రంపై వేడి పెంచాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా బ‌డ్జెట్ సంగ‌తి ప‌క్క‌న పెట్టినా.. ప్ర‌త్యేక హోదా స్థానంలో ఇచ్చిన ప్యాకేజీకి సైతం నిధులు కేటాయించ‌క‌పోవ‌డాన్ని టార్గెట్ చేయాల‌న్నారు. ఈ స‌మావేశాల్లోనే ఏపీపై స‌మ‌గ్రంగా కేంద్రం హామీ ఇచ్చేలా మెడ‌లు వంచాల్సిన బాధ్య‌త‌ను ఎంపీల‌పై పెట్టారు చంద్ర‌బాబు. నిజానికి ఆయ‌న అమ‌రావ‌తి లో ఎంపీల‌కు దాదాపు గంట సేపు ఆయా స‌మ‌స్య‌ల‌పై త‌లంటారు కూడా.

తెల్ల మొహాలు వేస్తే....

అయితే, తీరా జ‌రిగింది ఏమిటి? బాబు గాలికొట్టి వ‌దిలిన ఎంపీలు ఏం చేశారు? అని త‌ర‌చి చూస్తే.. రాజ్య‌స‌భ‌లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వాగ్దాటి ముందు మొహాలు తేలేశారు. ఆయ‌న ఏపీకి ఏమేం చేశామో వివ‌రించే స‌మ‌యంలో అలా కాదు, ఇప్ప‌టి కి నాలుగేళ్లు గ‌డిచిపోయాయి. ఇంకా పాత లెక్క‌ల‌నే వ‌ల్లెవేస్తే ఎలా? అని ప్ర‌శ్నించ‌లేక‌పోయారు. ముఖ్యంగా రాజ్య‌స‌భ‌లో ఏపీ గురించి ప్ర‌స్థావించిన టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌కు ఇంగ్లీష్‌పై అంత ప‌ట్టులేక పోవ‌డం ఏపీకి శాపంగా మారిపోయింది. సీఎం ర‌మేష్ అడిగిన ప్ర‌శ్న‌కు తొలుత అంగీక‌రించ‌ని రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ కురియ‌న్.. చాలా సేప‌టి త‌ర్వాత అవ‌కాశం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ఆర్థిక మంత్రి ఇంగ్లీష్ లో దంచి కొట్టారు. ఏపీకి ఇప్ప‌టి వ‌ర‌కు లోటు బ‌డ్జెట్ కింద 3900 కోట్లు ఇచ్చామ‌ని, 14వ ఆర్థిక సంఘం ఒక్క ఈశాన్య రాష్ట్రాల‌కు త‌ప్ప‌, మిగిలిన రాష్ట్రాల‌కు హోదా ఇవ్వ‌ద‌ని చెప్ప‌డం వ‌ల్లే ఏపీకి ప్యాకేజీ ప్ర‌క‌టించామ‌ని చెప్పారు.

గత రెండేళ్లుగా చెబుతున్నవే.....

ప్యాకేజీలో నిధులు ఎలా ఇవ్వాలో ఇంకా గ‌ణాంకాలు సిద్ధం చేస్తూనే ఉన్నామ‌ని, దీనిపై ఆర్థిక నిపుణులు చ‌ర్చిస్తున్నార‌ని, గ‌త నెల 3న ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌మ‌కు లేఖ రాశార‌ని, కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల్లో 60% నిధులు కేంద్రం స‌మ‌కూరుస్తుండ‌గా రాష్ట్రం 40% నిధులు భ‌రించాల‌ని, అయితే, ఏపీకి 30% బ‌య‌ట నుంచి అప్పులు పుట్టేలా తాము వ్యూహం సిద్ధం చేస్తున్నామ‌ని మంచి నీళ్లు తాగిన‌ట్టు ఇంగ్లీష్‌లో దంచేశారు. అయితే, విచిత్రం ఏంటంటే.. ఈ మాట‌ల‌న్నీ కేంద్రం గ‌త రెండేళ్లుగా చెబుతున్న‌వే. జైట్లీ చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా తాజా విష‌యం లేదు. మ‌రి దీనిని ఖండించి ఎప్పుడు అడిగినా.. పాత పాటే పాడుతున్నారంటూ ప్ర‌సంగాన్ని అడ్డుకోవాల్సిన సీఎం ర‌మేష్‌.. ముఖం తేలేశారు.

ప్రశ్నించలేకపోయిన....

జైట్లీ ఇంగ్లీష్ ప్ర‌సంగాన్ని తాను ఎలా కొన‌సాగించాలో? ఎక్క‌డ అడ్డుకోవాలో ? కూడా తెలియ‌ని ప‌రిస్థితిలో మౌనం వ‌హించి జైట్లీ చెప్పిందంతా ఎల్‌కేజీ విద్యార్థి విన్న‌ట్టు విని త‌న సీటులో కూల‌బ‌డ్డారు. దీంతో ఇప్పుడు సీఎం ర‌మేష్ నాలెడ్జ్‌పైనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు. చంద్ర‌బాబు ఇలాంటి వాళ్ల‌నా స‌భ‌కు పంపించేది? అంటూ పెద‌వి విరుస్తున్నారు. జైట్లీ క‌న్నా వేగంగా ఇంగ్లీష్‌లో మాట్లాడ‌గ‌లిగిన వారు, జైట్లీ వాగ్ధాటిని ఎదుర్కొనేవారిని బాబు ఎంపిక చేసి ఉంటే బాగుండేద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తానికి రాజ్య‌స‌భ‌లో రాక రాక వ‌చ్చిన అవ‌కాశాన్ని సైతం మ‌న ఎంపీ ర‌మేష్ చేజార్చుకున్నార‌ని అంద‌రూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇలాంటి వారి వ‌ల్ల ఏపీకి ప్ర‌యోజ‌నం లేద‌ని తిట్టి పోస్తున్నారు.

Similar News