సీఈసీకి చేరిన ఢిల్లీ పంచాయితీ

Update: 2017-04-15 17:21 GMT

ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల వివాదం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. మునిసిపల్ ఎన్నికలను నెలో., రెండ్నెల్లో వాయిదా వేయాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో సీఈసీ జోక్యాన్ని కోరినట్లు ఢిల్లీ ఎన్నికల కమిషనర్‌ శ్రీవాస్తవ ప్రకటించారు. ఈమేరకు కేజ్రీవాల్‌కు ఓ లేఖను కూడా పంపారు. ఎన్నికలను వాయిదా వేసే నిర్ణయం ఇక కేంద్రం ఎన్నికల సంఘం తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ప్రకటించారు. ఎన్నికల వాయిదా కోరుతూ కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈవిఎంల స్థానంలో ఓటరుకు స్లిప్‌ జారీ అయ్యే యంత్రాలను ప్రవేశపెట్టాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. దీంతో పాటు ఢిల్లీ ఎన్నికల నిర్వహణ కోసం రాజస్థాన్‌ ఈవిఎంలను వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని కూడా కేజ్రీవాల్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అందుకే ఈవిఎంల ట్యాంపరింగ్‌పై ఎన్నికల సంఘం విచారణ జరిపేందుకు కూడా ముందుకు రావడం లేదని కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Similar News