ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక సిద్ధరామయ్య అన్ని శక్తులూ ఒడ్డుతున్నారు. ప్రత్యర్థి పార్టీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని దారులనూ మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. కమలనాధులు కూడా దక్షిణాదిలో ఆశ ఉన్న ఒకే ఒక రాష్ట్నాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నం తీవ్రంగా చేస్తుంది. అధికార పార్టీ వైఫల్యాల, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి కమలం పార్టీ సీరియస్ గా కృషి చేస్తోంది.
ప్రభుత్వోద్యోగులకు భారీ నజరానా...
అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అన్ని వర్గాల ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వరాల జల్లు కురిపిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం వేతనాలను పెంచాలన్న నిర్ణయాన్ని సిద్ధరామయ్య తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో 6.2 లక్షల మంది ప్రభుత్వోద్యోగులున్నారు. వారి కుటుంబాలతో కలుపుకుంటే లక్షల్లో ఓటర్లుంటారు. ఈ నేపథ్యంలో వారి జీతాలను 30 శాతం పెంచాలన్నది సిద్ధరామయ్య సరికొత్త నిర్ణయం. కేవలం జీతాలను పెంచడమే కాకుండా నాలుగో శనివారాన్ని ప్రభుత్వోద్యోగులకు సెలవు దినంగా కూడా ప్రభుత్వం ప్రకటించనుంది.
కమిటీ నివేదిక సిద్ధం....
సిద్ధరామయ్య ప్రభుత్వ ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించారు. రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ జీతాల పెంపుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నెల 31వ తేదీ నివేదిక ఇచ్చేందుకు సిద్ధరామయ్య డెడ్ లైన్ విధించారు. 30 శాతం వేతనాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాపై 10,800 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అయినా సరే ఉద్యోగుల వేతనాలను పెంచేందుకే సిద్ధరామయ్య సిద్ధమవుతున్నారు. అయితే ప్రతి నెల మొదటి, మూడో శనివారాల్లో ప్రభుత్వోద్యోగులు అదనపు గంటలు పనిచేయాల్సి ఉంటుంది. నాలుగో శనివారం సెలవు ఇస్తున్నాం కాబట్టి ఈ రెండు రోజులపాటు అదనంగా పనిచేయాలని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద సిద్ధరామయ్య అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరంచేశారు. కమలం పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
.