సిద్ధూ కుర్చీకి ఎసరు పెట్టిన చిన్నమ్మ

Update: 2018-03-08 20:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయనపై పెద్ద బాంబ్ ను పేల్చారు. శశికళ రూపంలో సిద్ధరామయ్యకు పెద్ద ముప్పే వచ్చి పడింది. శశికళ జైలులో ఉన్నప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ఆమెకు అన్ని సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక గదిని కేటాయించారు. వంట మనిషిని ఉంచారు. అలాగే బయటకు వెళ్లి రావడానికి అనుమతి ఇచ్చారు. పోలీస్ అధికారి రూప జైలును సందర్శించినప్పుడు ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి.

సిద్ధూ ఆదేశాలతోనే...

అయితే శశికళకు సకల సౌకర్యాలు అందిస్తున్నందున జైళ్ల శాఖకు చెందిన అధికారి సత్యనారాయణరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాని ఇప్పుడు అదే సత్యనారాయణరావు ఈ సకల సౌకర్యాలను కల్పించడానికి సిద్ధరామయ్యే కారణమని విచారణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తు కమిటీకి చెప్పారు. సిద్ధరామయ్య ఆదేశాలతోనే శశికళకు అన్ని సౌకర్యాలు కల్పించారని, ఇందులో తమ తప్పేమీ లేదని ఆయన విచారణ కమిటీ ముందు వాదించారు. ఇందుకు తమను బాధ్యులను చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.

బీజేపీకి అందివచ్చిన అవకాశం.....

సత్యనారాయణరావు చెప్పిన అంశాలు ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. బీజేపీకి ఎన్నికల సమయంలో మంచి ఆయుధం దొరికింది. ఇప్పటికే సిద్ధరామయ్యపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కమలనాధులు అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళకు సహకరించిన అంశాన్ని బీజేపీ పెద్దయెత్తున ప్రచారం చేస్తోంది. శశికళకు ఖరీదైన వసతులు కల్పించి సిద్ధరామయ్య అవినీతిని ప్రోత్సహించాడంటూ బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. మొత్తం మీద చిన్నమ్మ కర్ణాటక సీఎం కుర్చీకే ఎసరు పెట్టిందన్న వ్యాఖ్యలు విన్పిస్తన్నాయి.

Similar News