సిద్ధూ ఆయన్ను నిద్రపోనివ్వట్లేదుగా

Update: 2018-03-23 17:30 GMT

ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మల్చుకోవడంలో ముదుంటున్నారు. ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదలడం లేదు. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీని ఆయన నిత్యం టార్గెట్ చేస్తూనే ఉంటారు. తాజాగా దక్షిణాదికి కేంద్రప్రభుత్వంలో ఉన్న బీజేపీ అన్యాయం చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి గళం విప్పారు. అంతేకాదు అందరూ కలసి మోడీపై ఉద్యమించకపోతే దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం కాకతప్పదని కూడా హెచ్చరించారు. సిద్ధరామయ్య ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీని ఇరుకున పెట్టేలా ప్రతి ప్రయత్నమూ ఉంటుందనడంలో సందేహం లేదు.

ఏది తనకు అంది వచ్చినా....

కేంద్ర ప్రభుత్వం పన్నుల పంపిణీకి తీసుకున్న విధానం ఆయనకు కలిసి వచ్చినట్లుంది. వివిధ రాష్ట్రాలకు పన్నుల కేటాయింపును ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కల ప్రామాణికంగా తీసుకుంటుంది. ఎప్పుడూ పన్నుల కేటాయింపులో ఇదే ప్రాతిపదికను అనుసరిస్తారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పన్నుల కేటాయింపును 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరింది. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా అన్యాయం జరగుతుందన్నది సిద్ధరామయ్య వాదన.

జనాభా తగ్గినందున....

1971 తర్వాత దక్షిణాది రాష్ట్రాలన్నీ కుటుంబ నియంత్రణపై విపరీతంగా ప్రచారం కల్పించాయి. ఒకరు లేక ఇద్దరు అన్న నినాదాన్ని పల్లెపల్లెకూ తీసుకెళ్లగలిగి జనాభాను నియంత్రించగలిగారు. కాని ఉత్తరాదిన ఆ పరిస్థితి లేదంటున్నారు. ఉత్తరాదిలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి తక్కువ నిధులు అందే అవకాశముంది. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా లాభపడే అవకాశముంది. అందుకే ఎప్పటి నుంచో 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలన్న డిమాండ్ విన్పిస్తోంది.

అన్ని రాష్ట్రాల సీఎంలకు...

ఈనేపథ్యంలో 15వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం 2011 జనాభా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకోవాలని కోరడాన్ని సిద్ధరామయ్య తనకు అనుకూలంగా మలచుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాలని సిద్ధరామయ్య పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ప్రజల ముందు ఎండగట్టాలని ఆయన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ట్వీట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కల్గించేలా ఉన్న కేంద్రం చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని సిద్ధూ పిలుపునిచ్చారు. మొత్తం మీద సిద్ధరామయ్య ప్రతి విషయంపై కేంద్రంపై కయ్యానికి కాలుదువ్వుతూ వార్ గ్రౌండ్ ను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నట్లే కన్పిస్తోంది.

Similar News