కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొరివితో తలగోక్కున్నట్లే కన్పిస్తోంది. అనవసరంగా కష్టాలు కొని తెచ్చిపెట్టుకున్నారనిపిస్తోంది. కర్ణాటకలో ఎన్నికలు జరగుతున్న సమయంలో లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. కర్ణాటకలో లింగాయత్ లు ఎక్కువ శాతం మంది ఉన్నారు. 17 శాతం ఉన్న వారి ఓట్లను చేజిక్కించుకునేందుకు సిద్ధరామయ్య దీనిపై ఒక కమిటీని వేసి మరీ దానికి ఎన్నికల ముందు ఆమోదం తెలిపారు. అంటే లింగాయత్ లు, వీర శైవ లింగాయత్ లకు మైనారిటీ హోదా కల్పించాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం.
సర్కార్ కు చికాకులు తప్పవా?
అయితే ఇదే సిద్ధరామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉంది. కర్ణాటకలో లింగాయత్, వీర శైవ లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయడంపై ఇతర కులాలు మండి పడుతున్నాయి. తమకు కూడా ప్రత్యేకమతంగా గుర్తించి, మైనారిటీ హోదా కల్పించాలని కోరుతూ ఆందోళనకు దిగుతున్నాయి. కర్ణాటకలోని సుమారు 37 కులాలు పోరుబాట పట్టాయి. దీంతో సిద్ధరామయ్య అయోమయంలో పడినట్లయింది. ఇందులో సిద్ధరామయ్య కులమైన కురుమ కూడా ఉండటం విశేషం. కురుమ కులం కూడా తమను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ ఆందోళనకు దిగుతోంది.
అందరూ తమది వేరే మతమంటూ.....
ఇక తమది వేరే మతమంటున్నారు కొడవలు. వీరు ప్రత్యేక రాష్ట్రం గురించి కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీరు కూడా తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని పోరుకు సిద్ధమయ్యారు. కొడవలు తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతూ జాతీయ మైనారిటీ కమిషన్ కు కూడా లేఖరాశారు. లింగాయత్ లు మహారాష్ట్రలో ఏడు శాతం మంది ఉన్నారు. అయితే అక్కడి డిమాండ్ మేరకు వారిని ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈవిషయాన్ని గుర్తు చేస్తూ తమను ప్రత్యేక మతంగా గుర్తించేంత వరకూ ఆందోళన ఆగదని లింగాయత్ లు హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఓట్ల మాటేమో కాని....
ఇలా సిద్ధరామయ్య ఓట్లకు వల విసిరబోయి తాను చిక్కుల్లో పడ్డారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బీజేపీ దీనిని అవకాశంగా మలచుకుంది. సిద్ధరామయ్య కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడపాలనుకుంటున్నారని ఆరోపిస్తోంది. అసాధ్యమైన హామీలను గుప్పించడమే కాకుండా, జాతి విధ్వేషాలను సిద్ధరామయ్య రెచ్చగొడుతున్నారని కమలనాధులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. అయితే సిద్ధరామయ్య మాత్రం లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించడాన్ని ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. తాము కేంద్రానికి సిఫార్సు చేశామని, అది కేంద్రం చేతుల్లో ఉందని చెబుతున్నారు. మొత్తం మీద సిద్ధరామయ్య సర్కార్ తీసుకున్న నిర్ణయం రానున్న ఎన్నికల్లో ఎన్ని ఓట్లను తెస్తుందో తెలియదు కాని కర్ణాటకలో కులాల మధ్య గొడవలు ముదురుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.