రెండు ప్రధాన సామాజికవర్గాల కొట్లాట ఇది.. కానీ ఎవ్వరూ పైకి పెదవి విప్పరు... ప్రెస్ మీట్ పెట్టరు. ఈ ఇద్దరి మధ్యనే ఇంకొందరు నలిగిపోవచ్చు.కొన్నిసార్లు అసలు తమ ఉనికే లేకుండా పోనూవచ్చు. అవే కాళింగ వెలమ. ఇప్పుడు రిజర్వేషన్ల గొడవ ఒకటి ముదిరి పాకాన పడుతోంది కనుక కాపు సామాజిక వర్గ నేతలు కూడా కొంతలో కొంత సత్తా చూపించనూవచ్చు. ఇవి కాక మరో రెండు సామాజికవర్గాలు ఎప్పటినుంచో తమవెనకబాటును ప్రశ్నిస్తున్నాయి అవే దళిత , గిరిజన.. ఇలా ఎవరికి వారు తమ ఉనికికి మనుగడకు రాజ్యాధికారానికి తెగ తాపత్రయపడుతున్నారు.
కాపు నేత బొత్స.. వెలమ నేత ధర్మాన...
ఎర్రన్న మరణానంతరం సిక్కోలు గడ్డపై తిరుగులేని నేతగా ధర్మాన పేరు తెచ్చుకోవాలని అనుకున్నా.. నాటి ఎన్నికల్లో ఆయన సత్తా చూపలేకపోయారు. గుండ లక్ష్మీ దేవి చేతిలో ఘోరపరాజయం పాలయ్యారు. భారీ తేడాతో ఇంటికే పరిమితం అయ్యారు. కొన్నాళ్లు శ్రీకాకుళం నియోజకవర్గంలో తిరగనూలేదు. పెద్దగా మాట్లాడనూ లేదు. దీంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీ లో చేరిన ఆయనకు ముందు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోనూలేదు. ముఖ్యంగా ఆయన అన్నయ్య కృష్ణదాసుకు జగన్ దగ్గర ఉన్న వాల్యూ ఈయనకు లేదు. అంతేకాదు ఓ సమాచారం ప్రకారం ఆ ఎన్నికల్లో ధర్మాన చేరికను కూడా వ్యతిరేకించారు జగన్. ఏదో ఓ విధంగా ఆయనను నచ్చజెప్పి ఇటుగా తీసుకువచ్చారు కృష్ణదాస్. ఇదే సమయంలో జగన్ చెంతకు బొత్స సత్యనారాయణ చేరినా ఆయనకూ పెద్దగా ప్రాధాన్యమేమీ దక్కలేదు. కొద్దిరోజులు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి సైలెంట్ అయిపోయారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయనకు ఇటు శ్రీకాకుళం అటు విజయనగరంతో మంచి అనుబంధం ఉంది. సిక్కోలులో బలమైన సామాజికవర్గంగా ముద్ర వేయకున్నా పాతపట్నం తదితర ప్రాంతాలలో కాపు సామాజికవర్గానికి పట్టుంది.వైసీపీలో కూడా కీలక కాపు నేతలంతా ఉన్నప్పటికీ పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ జగన్ కు గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేశారు. కాపు రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో కాస్తో కూస్తో జిల్లాలో సంబరాలు జరిగినా అవేవీ చెప్పుకోదగ్గవి కావు. సో.. ఇవాళ వెలమ, కాళింగ సామాజికవర్గాలు బలంగా ఉండి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంటున్పప్పటికీ ఎప్పుటికప్పుడు నువ్వా నేనా సై అన్నట్లే పదవుల పందేరంలో ఉంటున్నాయి.
జాలరి వలలో....
సుదీర్ఘ తీరం ఉన్న శ్రీకాకుళం జిల్లాకు మత్స్యకార ఓటర్లు ఎంతో కీలకం. పదినియోజకవర్గాలున్న ఈజిల్లాలో సగానికిపైగా నియోజకవర్గాలను వీరు ప్రభావితం చేయగలరు. తాజాగా వీరు తమను ఎస్టీల్లోకి చేర్చాలని పట్టుబడుతున్నారు. దీనిని కాళింగులు తమకు అనుగుణంగా మార్చుకునేందుకు వీరి ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.అందుకనో ఎందుకనో పోటాపోటీగా వివిధ పార్టీలకు చెందిన కాళింగ నేతలు వీరి శిబిరాలకు నిరసనలకు మద్దతు పలుకుతున్నారు. నిన్నటి వేళ కూన రవి (విప్) సైతం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జాలర్లు ఏర్పాటుచేసిన దీక్షా శిబిరానికి చేరుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు కాళింగులను ఎస్టీల్లో చేర్చాలన్న ఓ ప్రతిపాదనను కూడా వీరు నెమ్మదినెమ్మదిగా తెరపైకి తెచ్చి మత్య్యకారులతో జతగట్టి రాజకీయ లబ్ధిని పొందేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా ఈ సారి ఎన్నికలు రాక ముందే రిజర్వేన్ల పేరిట, వనసమారాధనల పేరిట జిల్లాకు చెందిన ఆ రెండు సామాజికవర్గాలూ తమవంతు ప్రయత్నాల్లో మునిగితేలుతున్నాయి.