సిక్కోలు రాజ‌కీయంలో పంచ‌తంత్రం ఫ‌లిస్తుందా..!!

Update: 2017-12-26 11:30 GMT

ఐదుగురు కుర్రాళ్లు.. రాజ‌కీయ వార‌సులు.. ఉన్నత విద్యావంతులు.. వారే సిక్కోలులో తిరుగులేని రాజ‌కీయ ప్రభ‌ని ఆశిస్తున్న కీల‌క నేత‌ల కుమారులు. రండి వారి గురించి తెలుసుకుందాం.. రానున్న ఎన్నిక‌ల్లో వారి రాణింపు ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం. తండ్రుల మార్గంలో న‌డుస్తున్న వీరంతా ఏం చేయ‌నున్నారు.. ఏం కావాలి అనుకుంటున్నారో కూడా స‌వివ‌రంగా అందించే ప్రయ‌త్నమే ఈ క‌థనం.

నాన్న ఎర్రన్న కుమారుడు రామ‌న్న.....

టీడీపీ సీనియ‌ర్ నేత కింజ‌రాపు ఎర్రన్నాయుడు సిక్కోలు రాజకీయాన్ని అంతా తానై న‌డిపారు. కొంద‌రిని ఎద‌గ‌నిచ్చారు. కొంద‌రికి కంట‌గింపుగా మారారు.. కొంద‌రి ఎదుగుద‌ల‌కు ప్రతిబంధ‌కం అయ్యారు కూడా! ఇవాళ ఆయ‌న‌కు భ‌క్తులు కొద్ది మందే అయిన‌ప్పటికీ వారంతా ఆయ‌న వార‌సుడు రామ్మోహ‌న్ నాయుడు చెంతే ఉన్నారు. ఉన్నత విద్యావంతుడైన రామూ (బీటెక్ ఎంబీఏ) ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి నేటి వ‌ర‌కూ త‌న‌దైన పంథాలో దూసుకుపోతున్నాడు.. కానీ కొన్ని అసంతృప్త వాదుల‌ను/ వాదాల‌ను చ‌క్కదిద్దలేక‌పోతున్నాడు.. స‌ర్దిచెప్పలేక‌పోతున్నాడు. బాబాయ్ అచ్చెన్నకు ఎదురుగా వెళ్లి ఓ మాట చెప్పలేక త‌న భ‌విత‌వ్యాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. అచ్చెన్న తిరుగులేని నేత‌గా పేరున్న రామూ విష‌యంలో ఆయ‌న చేసినా లేదా చేస్తున్న త‌ప్పిదాలు ఒకింత గంద‌ర‌గోళానికి దారితీస్తున్నాయి. ఆఖ‌రికి ఆయ‌న ఇచ్చిన లెట‌ర్లను సైతం అచ్చెన్న చింపేశార‌న్న అప‌వాదూ ఉంది. దీనిని ఆయ‌న ఖండించ‌లేదు. మీడియాలో క‌థ‌నాల‌ను ఆయ‌న ఏనాడూ త‌ప్పని బాహాటంగా చెప్ప లేదు. క‌నీసం ఓ ప‌త్రికా ప్రక‌ట‌న కూడా విడుద‌ల చేయ‌లేదు. ఓ విధంగా ఆయ‌న సాయం ఈ కుర్రాడికి కొంత అందడం లేద‌నే చెప్పాలి. దీంతో ఈ సారి అంద‌లం ద‌క్కినా మునుప‌టిలా ఈ కుర్రాడు ఉంటే మాత్రం క‌ష్టమే! ఎందుకంటే ఇవాళ రామూపై ఉన్న అంచ‌నాలు అలాంటివి క‌నుక వాటిని ఆయ‌న త‌ప్పక చేరుకోవాలి. మంచి వాగ్ధాటితో పార్లమెంట్‌లో అంద‌రి మ‌న్నన‌లూ పొందుతున్న ఈ నేత‌కు కొన్ని ఎదురుదెబ్బలు త‌ప్పడం లేదు. వీటిని అధిగ‌మిస్తే ఈ కుర్రాడికి తిరుగులేదు. మూడు భాష‌లు (ఇంగ్లీష్‌, హిందీ , తెలుగు) అన‌ర్గళంగా మాట్లాడే స‌త్తా, యువ‌త‌లో ఫాలోయింగ్ ఇవి చాలు అనుకుంటే కాదు ఇంకా స‌మ‌ర్థ నాయ‌క‌త్వ ల‌క్షణాల్ని పెంపొందించుకోవాలి. విశాఖ రైల్వే జోన్ సాధ‌న‌కు , ఉద్దానం లో నెల‌కొన్న కీలక కిడ్నీ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఇంకా ఇంకొన్నింటిపై పోరాట పంథాని పెంపొందించుకోవాలి. విద్యార్థి రాజ‌కీయాల నుంచి ఎదిగిన నేత ఎర్రన్న.. నాన్న బాట‌లో న‌డిచి త‌న పేరుకు గుర్తింపున‌కూ కొన‌సాగింపు ఇస్తున్నది ఈ రామన్న. క‌నుక ఈ చిన్నోడు సాధించాల్సింది సాధ‌న చేయాల్సింది ఎంతో!!

గుండ వారింటి వార‌సుడు...

శ్రీ‌కాకుళం ఎమ్మెల్యేగా చిర‌ప‌రిచితురాలైన ల‌క్ష్మీదేవి చిన్నకుమారుడు గుండ విశ్వనాథ్ కూడా ఉన్న విద్యావంతుడు. గ‌త ఎన్నికల్లో అమ్మ త‌ర‌ఫున పోటీచేసి అంద‌రికీ చేరువ‌య్యాడు. ఆయ‌న తండ్రి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయ‌ణ కూడా నా వారసుడు అయితే గియితే విస్సూనే అని ప‌దే ప‌దే అంటుంటారు కూడా! పొలిటిక‌ల్ గా లోప్రొఫైల్ మెయింటైన్ చేసే కుటుంబంగా పేరుంది వీరికి. ఇప్పటికీ ఈ ఇంట ఆతిథ్యం ఓ సామాన్యుడికి ద‌క్కే గౌర‌వం ఎన్నటికీ జిల్లా ప్రజ‌లు మ‌రిచిపోరు. హార్వర్డ్ స్కూల్ లో ఇన్ స్ట్రక్చర్ గా ఉన్నారీయ‌న‌. ఈయ‌న అన్నయ్య శివ కూడా ఉన్న‌త విద్యావంతులే.. విస్సూ క్యాన్సర్ పై అనేకానేక ప‌రిశోధ‌న‌లు చేశారు. ప్రజ‌ల‌కు మేలు చేద్దామ‌న్న త‌లంపు ఉన్న కుర్రాడీయ‌న‌. నాన్నలానే ఈ కుర్రాడు కూడా సింపుల్ సిటీనే కోరుకుంటాడు. సోష‌ల్ కాజ్ కోసం ప‌నిచేసేందుకు తానెప్పుడూ సిద్ధమేన‌ని అంటారీయ‌న‌.త‌న‌కు తోచిన రీతిన ప్రభుత్వ పాఠ‌శాలల్లో డిజిట‌ల్ ఎవేర్ నెస్ తీసుకువ‌చ్చేందుకు కొన్ని ప్రణాళిక‌లు సైతం రూపొందించారు. ఈ కుర్రాడు రానున్న ఎన్నిక‌ల బ‌రిలో దిగే ఛాన్స్ ఉంది.

ఆ ముగ్గురూ సో..సో..

రాష్ట్ర మంత్రి క‌ళావెంక‌ట్రావు కొడుకు మ‌ల్లిక్ నాయుడు, మాజీ మంత్రి ధ‌ర్మాన కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు (అలియాస్ చిన్నీ), మ‌రో మాజీ మంత్రి త‌మ్మినేని కుమారుడు నాగ్ వీరు ముగ్గురు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా క్రియాశీల‌కంగా వ్యవ‌హ‌రించ‌లేక‌పోతున్నార‌న్నది ఓ వాస్తవం. వీరితో పోలిస్తే శివాజీ త‌న‌య శిరీష తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా దూసుకుపోతున్నారు. అదేవిధంగా ఒక‌నాటి రాజ‌కీయ నేత‌లు బొడ్డేప‌ల్లి రాజ‌గోపాలరావు , మ‌జ్జి తుల‌సీ దాసు వార‌సురాళ్లు స‌త్యవ‌తి, శార‌ద కూడా కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చుకున్నవారే! ఆ స్థాయిలో వీరు పేరు తెచ్చుకోవ‌డం క‌ష్టమే!

Similar News