వైసీపీ అధినేత జగన్ నేడు సింహపురి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటకు జగన్ ప్రజాసంకల్పయాత్ర ఈరోజు చేరుకోనుంది. చిత్తూరు జిల్లాలో గత ఇరవై రోజుల నుంచి సాగుతున్న యాత్ర ముగియనుంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. సూళ్లూరుపేట నియోజకవర్గం తొలి నుంచి అన్ని పార్టీలకూ ఆసరాగా నిలుస్తోంది. 1985లో తెలుగుదేశంపార్టీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. తర్వాత 1989లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసల పెంచలయ్య గెలిచారు. తర్వాత 1994,1999 ఎన్నికల్లో వరుసగా పరసా వెంకట రత్నం గెలిచారు. 2004లో మాత్రం వైఎస్ హవా కారణంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నెలవల సుబ్రహ్మణ్యం గెలిచారు. తిరిగి 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ పరసా వెంకటరత్నం గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి సంజీవయ్య ఇక్కడ విజయం సాధించారు.
సెంటిమెంట్ తో.....
ఒకసారి ఇక్కడ విజయం సాధిస్తే మరోసారి గెలవరన్నది ఇక్కడ సెంటిమెంట్ గా ఉంది.అందుకోసమే జగన్ సూళ్లూరు పేట నియోజకవర్గంలో ప్రజాసంకల్ప పాదయాత్రను చేపట్టారు. మరోసారి ఇక్కడ ఫ్యాన్ తిరగాలన్నది అధినేత ధ్యేయంగా ఉంది. సూళ్లూరుపేటలో జగన్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైసీపీకి అండగా నిలిచింది. మరోసారి కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీ జెండా రెపరెపలాడాలన్నది ఆ పార్టీ ప్రయత్నం చేస్తోంది. జగన్ పర్యటనలోనే నేతల మధ్య విభేదాలను కూడా పరిష్కరించేందుకు జగన్ కృషి చేయనున్నారు.
చిత్తూరులో ముగిసిన యాత్ర.....
జగన్ పాదయాత్ర 69వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రెడ్డిగుంట బాడవ శివారు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభంకానునంది. సురమాల గ్రామంతో జగన చిత్తూరు జిల్లాలో యాత్రను ముగించనున్నారు. తర్వాత జగన్ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ , పెనబాక, పీటీ కండ్రిగ, అర్లపాడు క్రాస్ రోడ్స్, చెంబేడు, నందిమాల క్రాస్ రోడ్స్, సీఎస్ పేట, ఉమ్మాలపేట వరకూ యాత్ర కొనసాగనుంది. నిన్న జగన్ 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. జగన్ ఇప్పటి వరకూ 923 కిలోమీటర్లు నడిచారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ముగిసి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుండటంతో జగన్ కు స్వాగతం చెప్పేందుకు నెల్లూరు వైసీపీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.