మావోయిస్టు లతో సంబంధాల కేసులో అరెస్ట్ అయ్యి నాగపూర్ లోని అండా సెల్ లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయి బాబా కోసం విదేశాల్లో ఉద్యమాలు మొదలయ్యాయి. న్యూయార్క్ , లండన్ లలో సాయిబాబా కు క్షమాభిక్ష పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ భారత రాయబార కార్యాలయాల ఎదుట ఆందోళనలు సాగుతున్నాయి. 90 శాతం వైకల్యంతో వున్న ఆయనకు కఠిన కారాగార శిక్ష విధించడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే తాను ఈ చలికాలంలో బతుకుతానో లేనో ఆంటూ సాయిబాబా హైదరాబాద్ లోని తన భార్య కు లేఖ రాశారు. ఆ లేఖ సోషల్ మీడియా లో వైరల్ కూడా అయ్యింది.
ప్రభుత్వంలో కదలిక ఏదీ?
దేశవ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు సైతం సాయిబాబా విడుదల కోసం ఉద్యమాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా విశ్వ వ్యాప్తం అయిన ఈ వార్తతో వివిధ దేశాల్లో ప్రజాస్వామ్య వాదులు కదిలారు.వైకల్యానికి లోనైనా వ్యక్తి పట్ల ప్రభుత్వం దయ చూపి క్షమాభిక్ష ప్రసాదించాలన్న డిమాండ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. అయినా ఈ అంశంపై ప్రభుత్వం లో కదలిక రాలేదు. రోజు రోజుకు తీవ్రం అవుతున్న సాయిబాబా క్షమాభిక్ష అంశంపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.