తమిళనాడులోని అన్నాడీఎంకే అసలు విషయాన్ని బయటకు చెప్పేసింది. అన్నాడీఎంకే కు పూర్తిగా బీజేపీ మద్దతుందని ప్రచారం జరిగింది. పళనిస్వామి ప్రభుత్వం మనుగడ కొనసాగించడానికి బీజేపీ అండదండలేకారణమని చెబుతారు. అంతేకాదు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటవ్వడానికి కూడా కమలనాధులే కారణమని నిన్నమొన్నటి వరకూ ఊహాగానాలుగా విన్పించాయి. శశికళ, దినకరన్ వర్గాలపై వేటు కూడా ఢిల్లీ డైరెక్షన్ లోనే జరిగిందన్న ప్రచారమూ లేకపోలేదు. దీంతో మోడీ అండతోనే పళనిస్వామి ప్రభుత్వం తమిళనాట రాజ్యమేలుతుందని అందరూ భావించారు. కాని ఎక్కడా ఇది నిరూపితం కాని అంశం. ఎందుకంటే రాజకీయ వ్యవహారాలన్నీ లోగుట్టుగానే కొనసాగుతాయి.
బయటపెట్టిన మంత్రి.....
అయితే తాజాగా ఈరోజు అన్నాడీఎంకే మంత్రి ఒకరు ఈ విషయాన్ని బయటకు చెప్పేశారు. తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మోడీ మద్దతు ఉన్నంతకాలం అన్నాడీఎంకే పార్టీ ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించడం విశేషం. నరేంద్ర మోడీ మద్దతు పూర్తిగా పళనిస్వామి సర్కార్ కు ఉందని ఆయన తెలిపారు. ఇక రెండాకుల గుర్తు కూడా తమకే వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఈపీఎస్ వర్గానికే రెండాకుల గుర్తు వస్తుందని ఆయన చెప్పారు. మొత్తం మీద అన్నాడీఎంకేను వెనకుండి నడిపిస్తుంది ఎవరో ఈ మంత్రిగారే బయటపెట్టారన్నమాట.