ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త తరహా పాలన జవాబుదారీ తనంలేకుండా నిస్సిగ్గుగా సాగిపోతుంది. రోడ్ డివైడర్ కి రంగు వేయాలన్న, హోర్డింగ్స్ ప్రభుత్వ ప్రచారం కోసం ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో యంత్ర పరికరాల మరమ్మత్తు తక్షణం చేయాలన్నా అంతా రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్టులు ఇచ్చేస్తున్నారు. జిల్లా, కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ ల పరిధిలో వుండాలిసిన పనులకు సైతం రాష్ట్ర స్థాయిలోనే కాంట్రాక్టులు పిలవడం ఇచ్చేయడం వారు చేసినా చేయకపోయినా బిల్లులు అయిపోవడం చక చక సాగిపోతున్నాయి. దాంతో ఏ పనికి ఎంత మొత్తం కాంట్రాక్టుగా ఇస్తున్నారు. ఆ పని సదరు కాంట్రాక్టర్ చేశారా లేదా ? నాణ్యత ఎలా వుంది ? అసలు పని జరిగిందా లేదా ? ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ఎవరికైనా ఏమైనా తెలిస్తే కదా ? అంతా లోకేశ్వరుని మాయ గా సాగిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో దయనీయ పరిస్థితి ...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్స్ రే తదితర రోగ నిర్ధారణ పరికరాలు మరమ్మత్తు కు గురైతే ఇక అంతే సంగతులు. కొత్తవి అయినా కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకోవాలేమో కానీ పాతవి ఇక చెల్లవు. వాస్తవానికి వీటిని తక్షణం మరమ్మత్తు చేసి ఆయా ఆసుపత్రుల్లో అందించేందుకు ఒక సంస్థకు ఏటా రెండువందల కోట్ల రూపాయలకు పైబడే రాష్ట్ర వ్యాప్త కాంట్రాక్ట్ ను ప్రభుత్వం అప్పగించింది. సదరు సంస్థ ఆ పని ముట్టుకుంటే ఒట్టన్నట్లు వ్యవహరిస్తుందని వైద్య వర్గాలు వాపోతున్నాయి. కారణం వాటికి కేటాయించిన నిధులు అధికార పార్టీలో చక్రం తిప్పే నేత జేబులోకి వెళ్లడమన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇలా బినామీ కాంట్రాక్టర్ లు ప్రతి కీలక శాఖలో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా వారు టెండర్లు వేసి ఆయా పనులు దక్కించుకోవడం చేయకపోవడం, చేసినా మొక్కుబడి తంతుగా లాగించేయడం రివాజుగా మారిందంటున్నారు. ఇలా లాగిన ప్రజాధనం రాబోయే ఎన్నికల్లో ప్రజలకే ఓట్ల కొనుగోలు కోసం వినియోగిస్తాం తప్ప మాకోసం కాదని ఒక సీనియర్ టిడిపి నేతే వ్యాఖ్యానించడం తాజా పరిస్థితికి నిదర్శనం