దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క సిరీస్ గెలిస్తే ఆ టీం సూపర్ డూపర్ టీం గా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. అలాంటిది టెస్ట్ సిరీస్ తృటిలో చేజార్చుకున్న వన్డే, టీట్వంటీ సిరీస్ లను సునాయాసంగా గెలిచి ఆతిధ్య జట్టుకు చుక్కలు చూపించింది కోహ్లీ సేన. టీట్వంటీ సిరీస్ ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్ లో హోరాహోరీగా పోరాటం చేసి 7 పరుగులతో విజేతగా నిలిచి డుమిని టీం కి షాక్ ఇచ్చింది టీం ఇండియా. ఈ విక్టరీ సౌండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో మార్మోగిపోతోంది.
ఆల్ రౌండ్ ఆటతో ...
మెన్ ఇన్ బ్లూ ఈ కీలకమైన ఈ మ్యాచ్ లో తొలిగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించి ప్రత్యర్థి ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీం ఇండియా లోని శిఖర్ ధావన్ 40 బంతుల్లో 47 పరుగులు సాధించగా, సురేష్ రైనా 27 బంతుల్లో 43 పరుగులు, పాండ్య 17 బంతుల్లో 21 పరుగులు సాధించి సఫారీ టీం ముందు గట్టి స్కోర్ లక్ష్యంగా పెట్టింది. సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్ మెన్ తొలినుంచి విజయంవైపు దూసుకువెళుతున్నట్లే కనిపించారు. కెప్టెన్ డుమిని 41 బంతుల్లో 55, జొన్కర్ 24 బంతుల్లో 49 పరుగులు, మిల్లర్ 23 బంతుల్లో 24 పరుగులు చేసి టీం ను విజయతీరాలకు చేర్చడానికి చివరికంటా పోరాడారు. మొత్తానికి భారత్ కట్టుదిట్టమైన ఫీల్డింగ్, బౌలింగ్ ముందు సౌత్ ఆఫ్రికా టీం ఓటమి చవిచూడక తప్పలేదు. ఇక భారత బౌలింగ్ లో భువనేశ్వర్ 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, పాండ్య 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్, రైనా 27 పరుగులకు ఒక వికెట్ పడగొట్టగా, సౌత్ ఆఫ్రికా బౌలర్లలో డాలా 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, మోరిస్ 43 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, సంసి 31 పరుగులకు ఒక వికెట్ పడగొట్టారు. సఫారీ గడ్డపై రెండు కీలక సిరీస్ లను దక్కించుకున్న టీం ఇండియా విదేశీ గడ్డపై పిల్లి అనే పేరు చెరిపేసుకుని సగర్వంగా భారత్ బయల్దేరనుంది.