నియోజకవర్గ నిధులు ఇచ్చారు. ఎమ్మెల్యేల జీతాలు పెంచారు. ఏది కావాలంటే అది చేసి పెడతామంటున్నారు. అయినా సరే వారిద్దరిపై నమ్మకం లేకుండా పోతోంది. తాజాగా అధికార అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యే దినకరన్ శిబిరంలో చేరడం సంచలనమయింది. అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే దాదాపు 18 మంది ఎమ్మెల్యులు దినకరన్ గూటికి చేరారు. ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా వారు గవర్నర్ కు సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కూడా ఇచ్చారు. దీంతో స్పీకర్ ధన్ పాల్ వారిపై అనర్హత వేటు కూడా వేశారు. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానం తీర్పును బట్టి పళనిస్వామి భవిష్యత్ ఆధారపడి ఉందన్నది అందరికీ తెలిసిందే.
దినకరన్ శపథం నెరవేరుతుందా?
అయితే ఈ నేపథ్యంలో దినకరన్ కొన్నాళ్ల క్రితం పళనిస్వామి ప్రభుత్వాన్ని మూడు నెలల్లో కూల్చి వేస్తానని ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వంలో తనకు స్లీపర్స్ సెల్స్ ఉన్నారని కూడా దినకరన్ ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ లో అన్నాడీఎంకే అభ్యర్థి ఘోరంగా ఓటమి పాలు కావడంతో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. దినకరన్ వర్గంగా ముద్రపడిని దాదాపు వెయ్యికి మందికి పైగానే నేతలను పార్టీ నుంచి బయటకు పంపించి వేశారు. పార్టీ సభ్యత్వాలను కూడా ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగానే ఇచ్చారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దినకరన్ గూటికి మరో ఎమ్మెల్యే....
ఇక ఎవరూ దినకరన్ గూటికి వెళ్లరని, ప్రభుత్వానికి ఢోకా లేదని భావిస్తున్న తరుణంలో మరో ఎమ్మెల్యే దినకరన్ గూటికి చేరడంతో అధికార అన్నాడీఎంకే పార్టీ షాక్ కు గురయింది. విళుపురం జిల్లా కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ప్రభు దినకరన్ చెంతకు చేరారు. అయితే ఆయన ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య చేయడం గమనార్హం. ఎమ్మెల్యే పదవి ఐదేళ్ల కాలమేనని, ఆ తర్వాత పదవి వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అంటే పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై తనకు నమ్మకం లేదని, ఆ పార్టీ ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాన్ని ఎమ్మెల్యే ప్రభు పరోక్షంగా ప్రస్తావించడం విశేషం. అంతేకాదు అన్నాడీఎంకేలో అనేకమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారని, ప్రజాకర్షణ ఉన్న నేతలు శశికళ, దినకరన్ లు మాత్రమేనని ఆయన పేర్కొనడం గమనార్హం.
నాయకత్వంపై అనుమానాలు....
నిజానికి కూడా పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. ఇద్దరూ కేంద్రంతో అంటకాగుతుండటం, ఢిల్లీ ప్రాపకం కోసం పాకులాడుతుండటాన్ని అనేక మంది ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి కమల్ హాసన్, రజనీకాంత్ పార్టీలు కూడా రంగంలో ఉండనున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనే సత్తా పన్నీర్, పళనిలకు లేదన్నది మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయంగా ఉంది. కొద్దోగొప్పో దినకరన్, శశికళ వైపే మొగ్గుచూపుతున్నారన్నది కూడా వాస్తవం. అసంతృప్తి బద్దలయితే త్వరలోనే దినకరన్ చెప్పినట్లుగా పళని ప్రభుత్వం కూలడం ఖాయమన్నది విశ్లేషకుల అంచనా.