సత్తా చాటిన కాంగ్రెస్...కమలానికి షాక్

Update: 2018-02-27 11:30 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి ఘోర పరాభవం ఎదురయింది. పంజాబ్ లో జరిగిన నగరపాలకసంస్థ ఎన్నికల్లో కమలం పార్టీ చతికిల పడింది. పంజాబ్ రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన లూథియానా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. బీజేపీ, శిరోమణి అకాళీదళ్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇక పంజాబ్ లో కోలుకోలేదని తేలిపోయింది.

లూథియానా కార్పొరేషన్ కాంగ్రెస్ దే....

లూథియానా కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 24వ తేదీన జరిగాయి. ఫలితాలు ఈరోజు వెల్లడయ్యాయి. లూథియానా కార్పొరేషన్ పరిధిలో మొత్తం 95 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించారు. ఇందులో 61 కార్పొరేషన్లలో హస్తం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. శిరోమణి అకాళీదళ్ 11 డివిజన్లను, బీజేపీ కేవలం పది డివిజన్లను మాత్రమే గెలుచుకుంది. లోక్ ఇన్సాఫ్ పార్టీ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలవగలిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు నాలుగు చోట్ల గెలిచారు. గత ఏడాది జరిగిన అమృత్ సర్, పాటియాలా, జలంధర్ కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పంజాబ్ లో కాలుమోపాలన్న బీజేపీ ఆశలకు మరోసారి కాంగ్రెస్ గండికొట్టింది.

Similar News