తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం రాజకీయాలు బాగా హీటెక్కనున్నాయి. అధికార విపక్ష కార్యక్రమాలకు తోడు నిరసనలు, ఉద్యమాలకు జనవరి 7 వేదిక కానుంది. కాంగ్రెస్ రాజ్య సభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు కుటుంబ సమేతంగా పోలవరం నిర్మాణం కోసం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ధవళేశ్వరం నుంచి నాలుగు రోజుల పాటు పోలవరం కేంద్రమే నిర్మించాలని రాష్ట్ర ప్రజలపై భారం మోపొద్దని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సంకల్పించారు. ఆయన చేపట్టనున్న ఈ ఆందోళన అన్ని పార్టీల్లో రాజకీయ వేడి రగిలించింది.
తూర్పులో లోకేష్ ...
ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర పంచాయితీ రాజ్ ఐటి శాఖామంత్రి లోకేష్ సైతం ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన తో పలు అభివృద్ధి కార్యక్రమాలు సభలు సమావేశాల్లో పాల్గొననున్నారు. పార్టీ స్థితిగతులను సైతం అధ్యయనం చేయనున్నారు.
అమలాపురం లో హర్ష కుమార్ దీక్ష ...
ఇక ఆదివారమే చలో అమలాపురం కార్యక్రమానికి మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ అమలాపురం గడియారస్థంభం సెంటర్ లో హర్ష కుమార్ ఒక రోజు దీక్ష చేపడుతున్నారు. దీనికోసం దళితులంతా అమలాపురం చేరుకోవాలంటూ సోషల్ మీడియా లో హర్ష కుమార్ భారీ ప్రచారమే చేపట్టారు.
రాజమండ్రి లో 5 కె రన్ ...
ఇదిలా ఉంటే రాజమండ్రిలో 5 కె రన్ కార్యక్రమానికి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. శారీరక మానసిక ఎదుగుదలకు వ్యాయామం ప్రతి ఒక్కరికి తప్పనిసరంటూ అధికారులు భారీ ప్రచారం నిర్వహిస్తున్నారు. 5 కె రన్ కోసం ఏర్పాట్లు ఘనంగానే చేస్తున్నారు.
కెవిపి యాత్ర ప్రచారాన్ని అడ్డుకోవడానికేనా ...?
పోలవరం ప్రాజెక్ట్ పై నడుస్తున్న రాజకీయం ఇప్పుడు రోడ్డున పడింది. ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజల్లో అవగాహనా కల్పించడంతో పోలవరం పై ఏమి జరుగుతుందో అందరికి తేటతెల్లం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని నిలదీయలేని దైన్య స్థితిలో బిజెపి సర్కార్ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ విషయంలో దాగుడు మూతలు వంటి అంశాలు... కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి, విపక్షాల ఆందోళనలకు తెరతీసేలా చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు కెవిపి చేపట్టిన పాదయాత్ర మరోసారి పోలవరం ప్రాజెక్ట్ కేంద్రంగా రాజకీయాలను మరింత వేడెక్కేలా చేయనున్నాయి. వీటినుంచి డైవర్ట్ చేసేందుకు ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాలు హోరెత్తిపోవడానికి ఏర్పాట్లు చేయడం విశేషం.