థర్టీ ఫస్ట్ వేడుకలు హాయిగా జరుపుకోండి.. మీకు మేము సహకరిస్తాం.. కాదని మీ స్టయిల్ లో మీరుంటే.. మా తడఖా ఏంటో చూపిస్తాం.. డ్రగ్స్ వాసన వస్తే క్షణాల్లో ఊచలు లెక్కించేలా చేస్తాం.. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సిటీలో డ్రగ్స్ విక్రయాలుచేసేందుకు ప్రయత్నించిన ముఠాలను లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు ఆటకట్టించారు. అజ్ఞాతంలో ఉన్న మరికొన్ని ముఠాల కోసం గాలిస్తున్నారు.
హ్యాపీగా చేసుకోండంటున్న....
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అందరికీ ఇష్టమే.. ఈ వేడుకలు చేసుకునేందుకు దాదాపు నెలరోజుల నుండి ఎదురు చూస్తాం... అందుకోసం పాకెట్ మనీని బట్టి పార్టీ అరేంజ్ మెంట్స్ చేసుకుంటాం... హాయిగా జరుపుకునే వేడుకలకు మేము సహకరిస్తామంటున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు.. వేడుకలు శృతి మించితే మాత్రం తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చాం... కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చేసుకునే వేడుకలో ఏ పొరపాటు చేసిన సహించేంది లేదంటున్నారు.
యాభై బృందాల ఏర్పాటు....
ఇప్పటికే ఈ వేడుకల కోసం సిటీలో ఉన్న పబ్స్, రిసార్ట్స్, హోటల్స్, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. అందులో ఆదివారం రావడంతో టైం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. అయితే సిటీలో 2014 తో పోల్చి చూసుకుంటే ఈ ఏడాది 2017 డ్రగ్స్ వాడకం ఎక్కువైందంటున్నారు సిటి సిపి శ్రీనివాసరావు. ఈ నేపధ్యంలోనే తమకు అందిన సమాచారంతో మొత్తం 50టీమ్ లతో మాటు వేశామని చెప్పారు. గత ఏడాది 239 గ్రాముల డ్రగ్స్ పట్టుకుంటే ఈ ఏడాది 2017 900 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
భారీగా డ్రగ్స్ స్వాధీనం....
ఇక అసలు విషయానికి వస్తే పోలీసులు చేసిన ఆపరేషన్ లో ఇదిగో ఈ నైజీరియన్ ముఠా పట్టుబడింది. స్టడీ వీసా మీద వచ్చిన జాన్ చుక్వూ, తన స్నేహితులైన విల్సన్, మసన్ లుకాస్ తో కలిసి గత రెండున్నర సంవత్సరాలుగా ఈ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. గతంలో గోల్కొండ, జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లలో పట్టుబడి జైలుకి కూడా వెళ్లి వచ్చారు. బయటకు రాగానే మళ్లీ ఈ దందా కొనసాగిస్తున్నారు. అయితే వీరంతా ఎయిర్ కార్గో ద్వారా సౌత్ ఆఫ్రికా, నైజీరియా నుండి డ్రగ్స్ సిటీకి రప్పించినట్లు తెలిసింది. చేతికందిన డ్రగ్స్ ఎవరికి అనుమానం రాకుండా చాక్లె ట్స్ లా తయారు చేసి విక్రయాలు మొదలు పెట్టారు. విషయం పసిగట్టిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరి ఎత్తులను చిత్తు చేశారు. పట్టుబడిన ముఠా నుండి కోటి రూపాయల విలువచేసే 250 గ్రాముల కొకైన్, హెరాయిన్,చెరాస్ అనే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతూ....
ఇదిలావుంటే శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు సంతోష్ అనే ఇంజనీర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుండి ఎండిఎంఎ, ఎల్ ఎస్ డి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కళాశాల, స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలోతేలింది. మొత్తానికి ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా డ్రగ్స్ ముఠాలు పెద్దఎత్తున సిటీలో తిష్టవేశాయనడానికి పట్టుబడుతున్న ముఠాలే ఇందుకు నిదర్శనం. మరీ డ్రగ్స్ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు సిటీ పోలీసులు పన్నిన వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.