సంచలనం చేయాలనుకున్న డికె అరుణ

Update: 2016-10-01 09:08 GMT

సాధారణంగా తన వ్యాఖ్యల ద్వారా నిత్యం సంచలనాలు నమోదు చేస్తూ ఉండే గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఈసారి చేతల్లోకి దిగారు. గద్వాల ను జిల్లా గా చేసి తీరాల్సిందేననే డిమాండ్ ను చాలా బలంగా వినిపిస్తున్న డికె అరుణ.. తాను అక్కడి ఎమ్మెల్యే కావడం అన్నదే.. గద్వాలను జిల్లా చేయడానికి ఆటంకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తుంటే గనుక.. తాను రాజీనామా చేస్తాననే సవాలుతో వార్తల్లో నిలిచారు. శనివారం మధ్యాహ్నం ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ ప్రతిని ముఖ్యమంత్రికి పంపారు.

అయితే గద్వాల జిల్లా డిమాండ్ ను మరింత తీవ్ర స్వరంలో వినిపించే ప్రయత్నం తప్ప.. ఆమె సవాలులో మరొకటి కనిపించడం లేదు. పైగా డికె అరుణ తన రాజీనామా లేఖను స్పీకరుకే ఇస్తారంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. ఆ తర్వాత ఆమె ఏం అనుకున్నారో ఏమోగానీ.. లేఖను ముఖ్యమంత్రికి పంపారు. సీఎం కావలిస్తే.. ఆ లేఖను ఏ క్షణాన్నయినా స్పీకరుకు పంపుకోవచ్చునని చెప్పారు.

అయితే అరుణ.. సీఎంకు లేఖ ఇవ్వడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయాన్ని మీడియా ప్రత్యేకంగా ప్రస్తావించినప్పుడు.. ఒక డిమాండుతో రాజీనామా చేస్తున్నప్పుడు ఆ డిమాండు గురించిన నిర్ణయాధికారం ఆయన చేతుల్లో ఉన్నది గనుక.. ఆయనకే ఇస్తున్నట్లుగా అరుణ చెప్పారు. గతంలో తెలంగాణ కోసం తామందరం రాజీనామాలు చేసినప్పుడు కూడా.. లేఖలను సోనియా కే ఇచ్చాం తప్ప.. స్పీకరుకు ఇవ్వ లేదని ఆమె గుర్తు చేశారు.

Similar News