అనుకున్నట్టే అయింది. ఈసారి కూడా సంక్రాంతి దొంగలు రెచ్చిపోయారు. జనమంతా పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు సొంతూళ్లకు వెళ్తే... వాళ్ల ఇళ్లను దోచేశారు సంక్రాంతి దొంగలు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చోరీ ఘటనలు కలకలం రేపాయి. ఎక్కడెక్కడ చోరీలు జరిగాయి? దొంగలు ఎంత సొత్తు కొల్లగొట్టారో తెలుసా...?
రెక్కీ చేసి మరీ....
వరుసగా సెలవులొచ్చాయంటే దొంగలకు పండగే. ఇక సంక్రాంతి సెలవులైతే దొంగలకు ఫుల్ టైమ్ డ్యూటీనే. కాలనీల్లో రెక్కీ చేయడం... తాళం వేసి ఉన్న ఇళ్లను కొల్లగొట్టడం... పగలూ రాత్రీ ఇదే పని. ఈసారి కూడా సంక్రాంతి సెలవుల్లో రెచ్చిపోయారు దొంగలు. వరుస చోరీలతో హడలెత్తించారు. హైదరాబాద్ మీర్‌పేట్‌లో మూడు ఇళ్లలో దొంగలు చేతివాటం చూపించారు. తాళాలు పగలగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. రాఘవ నగర్ కాలనీలో నివసిస్తున్న ఇరిగేషన్ ఈఈ ఖాసీం ఇంట్లో 35 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ప్రగతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మీర్‌పేట్ పోలీసు స్టేషన్ హోంగార్డు మదనాచారి ఇంట్లో రెండున్నర తులాల బంగారం, పదివేల నగదు కాజేశారు. అదే కాలనీలో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో రెండు తులాల బంగారం, పదిహేను వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితులంతా సంక్రాంతి పండక్కి ఊరెళ్లినవాళ్లే. తిరిగొచ్చేసరికి ఇల్లుగుల్లైపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరుస దొంగతనాలతో....
ఇక రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలోనూ భారీ చోరీ జరిగింది. సాయిబాబా కాలనీలో వరుసగా మూడు ఇళ్లను కొల్లగొట్టారు దొంగలు. ఉన్నదంతా దోచుకెళ్లారు. మూడు ఇళ్లల్లో 48 తులాల బంగారం, ఒక కారు, లక్షా 30 వేల నగదు కాజేశారు. అటు విజయవాడలోనూ దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో బీరువా బద్దలుగొట్టి 75 కాసుల బంగారం, 50 వేల నగదు కాజేశారు. పండక్కి సొంతూరికి వెళ్లొచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచిఉన్నాయి. ఇంట్లోకెళ్లి చూస్తే సొత్తు మాయమైంది.
కర్నూలులో కూడా....
రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో నుంచి కేజీ బంగారం, 40 లక్షల నగదు దోచుకెళ్లారు దొంగలు. ఇంట్లో వాళ్లంతా పండక్కి ఊరెళ్లడంతో... రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటికి వేసిన తాళాలు తెరిచి ఉండటాన్ని పక్కింటివారు గుర్తించడంతో చోరీ విషయం వెలుగుచూసింది. విషయం తెలిసి ఇంటికి వచ్చిన ఓనర్... పోలీసులకు ఫిర్యాదు చేశారు.పండుగ సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లినవారంతా ఇంకా తిరిగి రాలేదు. అందరూ వస్తే... ఈసారి దొంగలు ఎన్ని చోరీలు చేశారో లెక్కతేలనుంది.