ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పటానికి వాళ్లెవరు? ప్రత్యేక ప్యాకేజీ చాలని అంగీకరించడానికి వీళ్లెవరు? అసలు ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి, ఏపీ సర్కార్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాయడం, దానికి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సమాధానం చెప్పడంపై జగన్ ఒక లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చాలా చేశామని బీజేపీ చెబుతోందని, ఏమీ చేయలేదని టీడీపీ అంటుందని, అసలు ఇవన్నీ ఎవరడిగారన్నారు. ప్రత్యేక హోదా ఒక్కటి ఇస్తే చాలని జగన్ అభిప్రాయపడ్డారు.
ఎందుకు పక్కకు మళ్లాల్సి వచ్చింది.....
ప్రత్యేక హోదా నుంచి చంద్రబాబు అసలు ఎందుకు పక్కకు మళ్లాల్సి వచ్చిందని జగన్ తన లేఖలో సూటిగా ప్రశ్నించారు. హోదా ఇస్తేనే కదా? రాష్ట్రం బతకగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఎలా ఉంటుందని చంద్రబాబు నమ్మారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకూ వైసీపీ పోరాటం సాగుతూనే ఉంటుందని జగన్ తెలిపారు. చంద్రబాబుహోదా నుంచి ప్యాకేజీకి మళ్లడం వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు.
మోడీ చెప్పినదానికి.....
ప్రత్యేకహోదా రాష్ట్రాలకు ఇచ్చే పారిశ్రామిక రాయితీలు ఇవ్వకుండా ఏపీ అభివృద్ధి ఎలా సాధించగలదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీ 2.25 లక్షల కోట్ల అప్పులకు చేరిన విషయాన్ని కూడా కేంద్రం గమనించకుండా, హోదాకు సమానం ప్యాకేజీ అని ఎలా చెబుతారని జగన్ నిలదీశారు. హోదా లేకుంటే వంద శాతం ఆదాయపుపన్ను రాయితీలు రావని, జీఎస్టీ మినహాయింపులు, పారిశ్రామిక రాయితీలు, విద్యుత్తు ఛార్జీల్లో రిబేటు వంటివి ఎలా వస్తాయన్నారు. ఇవన్నీ ఇవ్వకుండా ఏ పరిశ్రమ అయినా ఏపీలో పరిశ్రమ పెట్టేందుకు ఎందుకు ముందుకు వస్తుందని ప్రశ్నించారు. తిరుపతిలో మోడీ చెప్పిన దానికి కట్టుబడి ఉండరా? అని జగన్ సూటిగా ప్రశ్నించారు. తాము ఇప్పటికే అవిశ్వాసం పెట్టామని, తర్వాత రాజీనామాలు, ఆ తర్వాత పోరాటం కొనసాగుతుందని వైఎస్ జగన్ తన లేఖలో స్పష్టం చేశారు.