ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు రావాలంటే షరతులు వస్తాయని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసిన వైసీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కూడా అనర్హత వేటు వేస్తే తాము ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలుకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేతలు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు.
చింతమనేని పై కూడా.....
చింతమనేని ప్రభాకర్ కు ఇటీవల మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, అతని గన్ మెన్ పై దాడి చేసిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే రెండుసంవత్సరాలు జైలు శిక్ష పడిన చింతమనేనిపై అనర్హత వేటు వేయాలన్నది వైసీపీ డిమాండ్. చింతమనేనితో పాటుగా తమ పార్టీ నుంచి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేస్తేనే తాము బడ్జెట్ సమావేశాలకు హాజరవుతామని వైసీపీ నేతలు స్పీకర్ కు వినతిపత్రం ఇచ్చారు.
అలా చేస్తే ఆరో తేదీ నుంచే....
గత శాసనసభ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరుకాబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ కోడెల మాత్రం వైసీపీ సభ్యులను సభకు ఆహ్వానించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడానికి చక్కటి వేదిక శాసనసభ మాత్రమేనని ఆయన చెప్పారు. ఇందుకు ప్రతిగా వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పీకర్ కోడెలను కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. తమపార్టీ ఎమ్మెల్యేలు 5వ తేదీ ఢిల్లీలో ధర్నాలో పాల్గొంటున్నారని, అనర్హత వేటు ఎమ్మెల్యేలపై వేస్తే వెంటనే ఆరో తేదీన తాము సభకు హాజరవుతామని వారు చెప్పారు.