తిరుమల శ్రీవారి నిధులను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తోంది. తాను చేయాల్సిన పనులను ప్రభుత్వం తన ఖజానాకు చిల్లి పడకుండా వెంకన్న హుండీ నుంచే నిధులు కాజేయాలని చూస్తుంది. న్యాయస్థానాలు అనేకసార్లు తప్పుపట్టినా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. శ్రీవారికి ముడుపు కట్టి మరీ భక్తులు రూపాయి...రూపాయి హుండీలో వేస్తారు. అయితే భక్తులు ఇచ్చిన విరాళాలను తిరుమల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలను మెరుగుపర్చడానికి వినియోగించాలి. ఇటీవలే జాతీయ రహదారుల అభివృద్ధి కోసం పది కోట్ల రూపాయల నిధులను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే కొందరు దీనిపై కోర్టును ఆశ్రయించడంతో తప్పుపట్టింది. దీంతో వెనక్కు తగ్గింది. అయితే తాజాగా తిరుపతిలోని పార్కుల అభివృద్ధికి టీటీడీ నిధులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం మరోసారి వివాదాస్పదమయింది. టీటీడీ వార్షిక బడ్జెట్ 2600 కోట్ల రూపాయలు. భక్తులు ఇచ్చే విరాళాలు, ముడుపులతో టీటీడీ పలు వైద్యసంస్థలను, విద్యాసంస్థలను నిర్వహిస్తుంది. వేద పాఠశాలనూ నడుపుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి నిధులను కేటాయిస్తుంది. ధర్మప్రచారానికి కూడా నిధులను కేటాయిస్తుంది. వీటన్నింటినీ ఎవరూ తప్పుపట్టారు.
ప్రతి పనికీ టీటీడీపైనే ఆధారపడి......
కాని ప్రభుత్వం తన ఖజానా నుంచి ఖర్చు చేయాల్సిన నిధులను టీటీడీపైన రుద్దడంతోనే వివాదం తలెత్తుతోంది. గతంలో జరిగిన గోదావరి, కృష్ణా పుష్కరాలకు కూడా టీటీడీ నిధులనే ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక రాష్ట్రం విడిపోయి శ్రీరామ చంద్రుడి ఆలయం భద్రాద్రి తెలంగాణకు వెళ్లిపోవడంతో కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయ అభివృద్ధిని కూడా టీటీడీయే నెత్తికెత్తుకుంది. ఈ ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలను వెచ్చించింది. ఆలయ అభివృద్ధి పనులు కావడంతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ధార్మిక కార్యక్రమాలకు సంబంధంలేని కార్యక్రమాలకు కూడా టీటీడీ నిధులను వెచ్చించడాన్ని అనేకమంది తప్పుపడుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి కూడా టీటీడీ నిధులనే వెచ్చించడం గమనార్హం. వాస్తవానికి సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి ప్రభుత్వమే నిధులు ఖర్చు పెట్టాల్సి ఉన్నా సర్కార్ ఆ పని చేయలేదు. ఇక తిరుపతిలో రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా టీటీడీ నిధుల నుంచే ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక తిరుపతి చుట్టుపక్కల ఉన్న చెరువుల అభివృద్ధికి కూడా సర్కార్ టీటీడీ చేతనే నిధులు ఖర్చు చేయించింది. తాజాగా తిరుపతిలో పార్కుల అభివృద్ధికి టీటీడీ నిధులను వెచ్చించండంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిధులు లేకపోవడంతోనే ప్రతిపనికీ టీటీడీ పైనే ఆధారపడుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. భక్తులు ఇచ్చే నిధులను ఇతర పనులకు ఎలా ఖర్చు చేస్తారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు శ్రీవారి భక్తులు.