ప్రపంచ హిందూ ఆరాధ్య దైవం తిరుమల శ్రీనివాసుడు. తమ ఇష్ట దైవాన్ని ఎన్ని కష్ట నష్టాలను ఓర్చుకుని అయినా వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. స్వామి కి ఇటీవల మొక్కులు చెల్లించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో రోజుకు 50వేలనుంచి 70 వేలవరకు తిరుమల వస్తున్నారు. ఈ సంఖ్య పర్వదినాల్లో, బ్రహ్మోత్సవాల్లో లక్ష నుంచి లక్షా యాభైవేలవరకు పెరుగుతూ వస్తుంది. గోవిందుడి దర్శనానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరగడానికి సామాన్యులకు నానాటికి స్వామి దర్శనం దుర్లభం అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి.
విఐపి ల తాకిడితోనే ...
సాధారణ భక్తులకు శ్రీనివాసుని దర్శనం సమయం పెరుగుతూ పోవడానికి ప్రధాన కారణాల్లో వివిఐపి విఐపి ల సేవలో టిటిడి మునిగి తేలడమే. ఇది అందరికి తెలిసిందే. అదీ విఐపిలు నెలకి ఒకటి నుంచి రెండు సార్లు దర్శనానికి వస్తున్నారు. వీరికి తోడు వివిఐపిలు వస్తే అన్ని దర్శనాలు నిలిపి వేసి ప్రముఖులు, సెలబ్రెటీల సేవలో టిటిడి నడుస్తుంది. ఈ దర్శనాలను నియంత్రించలేని టిటిడి సామాన్యుల భక్తుల నియంత్రణకు మార్గాలు వెతుకుతుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించాలని దీనికి ఆధార్ అనుసంధానం ద్వారా సాధ్యం చేయొచ్చని యోచన చేస్తుంది.
దేవాదాయ మంత్రి మరో వివాదాస్పద ప్రకటన ...
రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే గజల్ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయనకు మద్దత్తు ప్రకటించి తరువాత నాలిక కరుచుకుని వెనక్కు తగ్గిన ఆయన దుర్గ గుడిలో క్షుద్ర పూజలపైనా అలానే తొందరపడి మొదట ఏమి లేదని ఆ తరువాత పూజలు జరిగాయని తెలిసి అవాక్కయ్యారు. ఈసారి మాణిక్యాల రావు టిటిడి వ్యవహారాల్లోనూ అలానే స్పందించారు. విఐపి లపై ఆంక్షలు పెట్టాలిసింది పోయి సామాన్యులు ఏడాదికి ఒకసారి తిరుమల గోవిందుని దర్శించుకోవాలని అంటున్నారు. ఆ విధంగా చేసేందుకు టిటిడి ఆధార్ కార్డు ల ద్వారా డేటా సేకరించి దర్శన నియంత్రణ చేపట్టేలా సాఫ్ట్ వేర్ రూపొందించాలన్నారు.
విఐపిలు వెనక్కి తగ్గాలన్న ఉపరాష్ట్రపతి ...
దేవాదాయ శాఖామంత్రి అలా అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సామాన్య భక్తులకు అనుకూలంగా వ్యాఖ్యానించారు. అవకాశం వుంది కదా అని పదే పదే శ్రీనివాసుని దర్శనానికి వివిఐపిలు, విఐపి లు తరచూ వస్తుంటే సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అందుకే తాను ప్రోటోకాల్ వున్నా వెంకన్నను ఏడాదికోసారి మాత్రమే దర్శించుకోవడానికి చూస్తాను తప్ప తరచూ రాను అని వెంకయ్య అన్నారు. విఐపి బ్రేక్ వంటివి నియంత్రించి సామాన్యులకు స్వామిని దగ్గర చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు.
భక్తులు నుంచి వెల్లువెత్తిన నిరసన ...
గోవిందుడి దర్శన సమయం కోసం వేచి వుండాలిసిన సమయం నానాటికి పెరగడానికి కారణం విఐపిలు అయితే తమను ఎందుకు నియంత్రిస్తారని ప్రశ్నిస్తున్నారు. చేతగాకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని అడుగుతున్నారు. ఏడాదిలో ఎన్నిసార్లు రావాలి ఎన్నిసార్లు మొక్కుకోవాలి అని చెప్పేందుకు మీరెవరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తిరుమలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చుడాలి. ఆపద మొక్కులవాడి దయ సామాన్యులపై ఉంటుందా విఐపి లపై ఉంటుందా అన్నది తేలనుంది.