శివాలెత్తిన కేసీఆర్ ...!

Update: 2017-11-25 04:30 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ యాక్షన్ లోకి దిగారు. యాదాద్రి ని తిరుమల లా చేయాలన్న సంకల్పం వహించిన సీఎం అక్కడ తాను అనుకున్న విధంగా పనులు సాగకపోవడంతో ఉగ్రనరసింహ అవతారం ఎత్తారు. రిటైనింగ్ వాల్, బ్రిడ్జ్ ల నిర్మాణాలు నత్తనడకన సాగడాన్ని కేసీఆర్ పరిశీలించి శివాలెత్తారు. పనులు చేయడం చేత కాదని చెబితే ఎలా చేయించుకోవాలో తనకు తెలుసు అంటూ విరుచుకుపడ్డారు. ఇలా అయితే ఎలాగని హెచ్చరించారు. వచ్చే ఏడాదికల్లా అన్ని పనులు పూర్తి కావాలని టార్గెట్ పెట్టారు ముఖ్యమంత్రి.

యాదాద్రి ని పుణ్యక్షేత్ర పర్యాటక ప్రాంతంగా ...

తెలంగాణ లోని యాదాద్రి ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి దీక్ష చేపట్టారు కేసీఆర్. యాదగిరిగుట్ట గా పిలవబడే ఈ ప్రాంతం పేరును కూడా తన గురువు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి చేసిన సూచనకు అనుగుణంగా యాదాద్రిగా పేరు మార్చారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి లక్ష్మి నరసింహుని ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి దక్షిణ భారత దేశం లోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లాలనేది కేసీఆర్ ఆలోచన. వచ్చే ఎన్నికల లోగా తన ఆలోచనలకు కార్యరూపంగా యాదాద్రి రూపుదాల్చితే ప్రజల్లో కూడా మైలేజ్ వస్తుందని భావిస్తే రాతి పనులు కావడంతో రాత్రి పగలు పనులు జరుగుతున్నా అనుకున్న మేర కట్టడాలు నిర్మితం కావడం లేదు. ఆలయ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో బాలాఆలయం లోనే స్వామి నిత్య పూజలు అందుకుంటున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాలకు కూడా పనులు పూర్తి అయ్యేలా లేకపోవడంతో ఇక బాల ఆలయ ప్రాంగణంలోనే అవి నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

Similar News