శివగామి పాత్ర శ్రీదేవి కోసమే ...

Update: 2018-02-26 02:30 GMT

చలన చిత్ర పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాహుబలి లో శివగామి పాత్ర అద్భుత సృష్టి. వాస్తవానికి ఆ పాత్రకు రమ్య కృష్ణకు ముందు శ్రీదేవి నటించాలి. శ్రీదేవికి ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి కి కొందరు సృష్టించిన గ్యాప్ తో ఆ పాత్ర ఆమెకు దూరమై రమ్యకృష్ణకు వరంలా దక్కింది. శ్రీదేవి కోసమే ఆ పాత్రను సృష్టించారు అనికూడా ప్రచారం జరిగింది. సంవత్సరాలు తరబడి నడిచిన షూటింగ్ కి సుదీర్ఘ కాల్ షీట్లు అవసరం కావడంతో ఆమె కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో కొన్ని కండిషన్లు పెట్టారని దాంతో రాజమౌళి నిరాశగా ఆమెను వదులుకోవాలిసి వచ్చిందన్నది స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. భారీ పారితోషికాన్ని సైతం డిమాండ్ చేయడమే అసలు కారణమనే ప్రచారం సాగింది. నిజానికి శ్రీదేవి సమయం కేటాయించేందుకు వీలు కలుగుతుందనే రాజమౌళి భావించారు. కుమార్తెల బాధ్యత పర్యవేక్షిస్తున్న శ్రీదేవి తొలి ప్రాధాన్యం వారికే ఇచ్చారని ఆ తరువాత మరో ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు.

శ్రీదేవికోసం మరో పాత్ర సిద్ధం చేసిన రాజమౌళి...

శ్రీదేవి పై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే సృష్టించాయి. శివగామి పాత్ర వ్యవహారం కొన్ని ఛానెల్స్ లో చర్చకు సినీ పరిశ్రమలో రచ్చను రేకెత్తేలా చేసింది. ఆ తరువాత రాజమౌళి కి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు శ్రీదేవి. తన భర్త నిర్మాత గా వున్నారని, తాను ఎన్నో చిత్రాల్లో నటించిన నటినేన, దర్శకులను నిర్మాతలను ఇబ్బంది పెట్టేలా ఎన్నడూ ప్రవర్తించలేదు ప్రవర్తించబోను అని స్పష్టం చేశారు. బాహుబలి చిత్రాన్ని రాజమౌళి చిత్రీకరించిన తీరుపై ప్రశంసలు కురిపించి తనపై ఆయన విమర్శలు చేసినా ఎంతో పరిణితి చూపించి అందరి మనసులు మరోసారి దోచుకున్నారు శ్రీదేవి. రాజమౌళి విజ్ఞతకే ఆయన చేసిన వ్యాఖ్యలు వదిలిపెట్టి వ్యక్తిత్వంలో తనకు సాటిమరొకరు రారు అని చాటిచెప్పారు ఆమె. దాంతో రాజామౌళి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. క్షమాపణలు సైతం చెప్పారు. శ్రీదేవి కోసమే మరో అద్భుత పాత్ర సృష్టించి ఆమెకు అవకాశం కల్పిస్తానని ప్రకటించారు కూడా. అలా వారిద్దరి నడుమ టీ కప్పులో తుఫాన్ అలా చల్లారిపోయింది. ఈ మెగా దర్శకుడు అతిలోక సుందరి చిత్రం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో అందరికి అందనంత దూరానికి విధి ఆమెను తీసుకువెళ్లడం విషాదం.

Similar News