తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ ది ప్రత్యేక స్టయిల్. ఆయన సినిమా రంగం నుంచి రావడంతో విచిత్ర వేషాలతో పార్లమెంటులో నిరసనలు తెలియజేస్తున్నారు. నిన్న కృష్ణుడి వేషం వేయగా, నేడు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు వేషంతో పార్లమెంటు ఆవరణలో హల్ చల్ చేశారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ శివప్రసాద్ ఇదే తీరులో తన నిరసనలను చేశారు. అయితే గత పార్లమెంటు సమావేశాల్లో ఆయన విచిత్ర వేషాలు వెగటు పుట్టించాయన్న విమర్శలు సర్వత్రా విన్పించాయి.
వేషాలపై విమర్శలు.....
వివిధ పార్టీలతో పాటు మేధావులు, వివిధ రంగాలకు చెందిన వారు సయితం శివప్రసాద్ నిరసనలను తప్పుపట్టారు. సీరియస్ గా ఉద్యమం చేయవలసిన సమయంలో శివప్రసాద్ విచిత్ర వేషాలతో దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారన్న విమర్శలూ విన్పించాయి. చివరకు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సయితం శివప్రసాద్ వేషాలను తప్పుపట్టారు. బుడబుక్కల వేషాలతో ఆందోళనలను నవ్వుల పాలు చేయవద్దని ఆయన సూచించారు. అలాగే మిగిలిన పార్టీలూ ఆయన వ్యవహార శైలిని తప్పుపట్టాయి.
వెగటు పుట్టిస్తున్న విచిత్ర వేషాలు....
నిన్న శ్రీకృష్ణుడి వేషంలో పార్లమెంటులోపలికి అడుగుపెట్టిన శివప్రసాద్ ను చూసి స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వేషాలు వేయొద్దని సున్నితంగా హెచ్చరించారు. తన ఛాంబర్ కు టీడీపీ నేతలను పిలిపించుకుని మరీ సుమిత్రా మహాజన్ క్లాస్ పీకారు. అయినా మనోడు ఈరోజు కూడా విచిత్ర వేషధారణతోనే పార్లమెంటు ఆవరణకు రావడం విశేషం. ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం ఉద్యమాన్ని చేస్తుంటే శివప్రసాద్ విచిత్ర వేషాలతో సీరియస్ నెస్ పోతుందన్న ఆందోళన సోషల్ మీడియలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎంపీకి వ్యతిరేకంగా.....
తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశంలోనూ చంద్రబాబు శివప్రసాద్ ను విచిత్ర వేషాలు వేయొద్దని సూచించినట్లు వార్తలొచ్చాయి. ఇలాంటి వేషాలతో ఏపీ పరువు పోతుందని కూడా చంద్రబాబు అన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయినా సరే శివప్రసాద్ మాత్రం రోజుకో వేషంతో పార్లమెంటు ఆవరణలోనూ, లోపల కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు చూసి నవ్వుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ఎంపీ శివప్రసాద్ చిల్లర వేషాలు మానుకుని, సీరియస్ గా విభజన హామీల అమలు కోసం పోరాడాలని నెటిజెన్లు కోరుతున్నారు.