తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అలక పూనినారా? అలక వహించి.. పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమానికి డుమ్మా కొట్టారా? పార్టీలో తన హోదా చాలా కీలకం అయినప్పటికీ, భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా తన పాత్ర చాలా పెద్దదిగా మారబోతున్నప్పటికీ.. శిక్షణ కార్యక్రమాలకు రావడం గురించి లోకేష్ ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు దూరంగా ఉండిపోయారు? ఆయన గైర్హాజరైతే ఎవరికైనా అనేక సందేహాలు కలుగుతాయి.
అయితే సాక్షి మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నారా లోకేష్ అలక పూనినట్లుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబునాయుడు మంత్రి వర్గ విస్తరణ చేపట్టి నారా లోకేష్ ను కీలక బాధ్యతల్లోకి తీసుకుంటారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈనెల ఒకటోతేదీనుంచి దీనికి సంబంధించి రకరకాల ముహూర్తాలు వచ్చాయి. పదవులు ఇవ్వడం అంటే.. ఒక పట్టాన తేల్చకుండా మీనమేషాలు లెక్కించే అలవాటు ఉన్న చంద్రబాబునాయుడు ఎటూ తేల్చలేదు.
ఇప్పటిదాకా మంత్రి పదవి ఇవ్వకపోవడం గురించి నారా లోకేష్ అలిగినట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. అందుకే రెండురోజులూ పార్టీ శిక్షణ శిబిరానికి కనీసం ఆయన రాలేదని చెప్పుకుంటున్నారు. సాక్షి మీడియాలో జరుగుతున్న ప్రచారం కావడం వలన.. తెలుగుదేశం అభిమానులు దీన్ని విశ్వసించకపోయినప్పటికీ.. నారా లోకేష్ గానీ, పార్టీ పెద్దలు గానీ దీనికి సంబంధించి ఏదో ఒక వివరణ ఇవ్వకపోతే.. జనానికి కూడా సందేహాలు కలిగే ప్రమాదం ఉంది.