జయలలిత నెచ్చెలి శశికళ భర్త నటరాజన్ అస్వస్థతకు గురయ్యారు. నటరాజన్ కు గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుండెకు సంబంధించి ఇన్ ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం గ్లెనగ్లస్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటరాజన్ పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు చెబుతున్నారు. ఆయనను ప్రస్తుతం అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ సాయంతో శ్వాసను అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
పెరోల్ కు దరఖాస్తు....
అయితే ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళ తన భర్తను చూసుకునేందుకు పెరోల్ అడిగినట్లు తెలుస్తోంది. నటరాజన్ ను చూసుకునేందుకు ఎవరూ లేరని, తనకు పెరోల్ ఇవ్వాలని ఆమె పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. గతంలోనూ కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న నటరాజన్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఈ సందర్భంగా శశికళ పెరోల్ మీద ఐదు రోజుల పాటు బయటకు వచ్చారు.
గతంలో విమర్శలు....
గతంలో పెరోల్ మీద శశికళ బయటకు వచ్చినప్పుడు నటరాజన్ వద్ద కంటే ఎక్కువగా శశికళ వదిన ఇళవరసి కూతురి ఇంట్లోనే ఉన్నారని అప్పట్లో పోలీసులు చెప్పారు. రాజకీయ సంబంధమైన చర్చలు కూడా శశికళ జరిపారని, పెరోల్ నిబంధనలకు విరుద్ధంగా శశికళ వ్యవహరించారని అన్నాడీఎంకే అప్పట్లో ఆరోపించింది. మరి ఈ సారి నటరాజన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్ మీద ఉండటంతో శశికళకు పెరోల్ దక్కే అవకాశముందని జైళ్లశాఖ వర్గాలు వెల్లడించాయి.