తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ గత మూడు నెలలుగా జైలులో మౌన దీక్ష చేస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. తనను కలవడానికి వచ్చిన వారితో కూడా మాట్లాడకుండా కాగితాలపై రాసి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. శశికళను చూడటానికి వచ్చిన వారు కూడా మాట్లాడటానికి వీల్లేదు. వారు కూడా కాగితంపై రాసి చూపాల్సిందే. మూడు రోజుల క్రితం పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళను ఆమె మేనల్లుడు దినకరన్ కలిశారు. దినకరన్ తో కూడా ఆమె మాట్లాడలేదు. అయితే దినకరన్ మాత్రం అన్నాడీఎంకే అమ్మ పేరిట పార్టీని రిజిస్ట్రేషన్ చేయించడానికి అనుమతివ్వాలని రాసి చూపించినట్లు తెలిసింది. దీనికి ఆమె మౌనంగానే ఉండటంతో్ దినకరన్ వెనక్కు తిరిగి వచ్చారు.
డిసెంబర్ 5 నుంచి.....
జయలలిత చనిపోయినతేదీ అయిన డిసెంబరు 5వ తేదీ నుంచి శశికళ ఈ మౌన దీక్షను చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఆమెనున ఐటీ అధికారులు విచారించాల్సి ఉంది. శశికళ, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులపై గత ఏడాది నవంబరులో ఐటీ శాఖ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దాదాపు 1,430 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఈ దాడుల్లో తేలింది. డొల్ల కంపెనీల ద్వారా చిన్నమ్మ బంధువుల పన్ను ఎగ్గొట్టారని తేలింది. దీంతో శశికళ కుటుంబ సభ్యులదంరినీ విచారించిన ఐటీ శాఖ అధికారులు శశికళను కూడా విచారించాలనుకున్నారు. ఆమెను తొలుత చెన్నైకు రప్పించాలని భావించినా అది సాధ్యపడలేదు. దీంతో బెంగళూరు వెళ్లి చిన్నమ్మను విచారించాలని డిసైడ్ అయ్యారు.
ఫిబ్రవరి తర్వాత ఐటీ శాఖ....
అయితే మూడు నెలల నుంచి చిన్నమ్మ మౌనదీక్ష చేపడుతుండటంతో ఆమె ఐటీ శాఖ అధికారులతో మాట్లాడేందుకు నిరాకరించారు. దాదాపు పదిహేను రోజుల క్రితం ఐటీ శాఖ పరప్పణ అగ్రహార జైలు అధికారులకు లేఖ రాసింది. శశికళ ను విచారించేందుకు అనుమతించాల్సిందిగా కోరారు. అయితే ఈ విషయాన్ని జైలు అధికారులు శశికళ దృష్టికి తీసుకెళ్లగా ఆమె ఫిబ్రవరి తర్వాత మౌనదీక్షను విరమిస్తానని చెప్పారు. దీంతో ఐటీ శాఖ అధికారులు ఫిబ్రవరి తర్వాత జైలులో ఉన్న చిన్నమ్మను విచారించే అవకాశముంది. జయ మరణించిన డిసెంబరు 5వ తేదీన శశికళ మౌనదీక్ష చేపట్టారని జైలు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఐటీ శాఖ అధికారులు చిన్నమ్మను విచారించేందుకు సిద్ధమయిపోయారు.