తమిళనాడులో ఇప్పుడు చిన్నమ్మ శశి కళ ఏమి చేస్తారన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆమె భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పెరోల్ పై కీలక సమయంలో బయటకు వచ్చిన శశి ఇప్పుడు చక్రం తిప్పే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారుట . తనకు హ్యాండ్ ఇచ్చిన పళని, స్వామి , పన్నీర్ సెల్వం అంతు చూడాలని శశి స్కెచ్ గీస్తున్నట్లు దినకరన్ వర్గంలో టాక్. పెరోల్ పై బయటకు వచ్చిన చిన్నమ్మ రెండుసార్లు భర్తకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రికి వెళ్ళి కొద్దిసేపు మాత్రమే ఉండి వచ్చేశారు . ఆమె ఎక్కువ సేపు తన వదిన ఇళవరసి కూతురి ఇంట్లోనే ముఖ్య అనుచరులతో మంత్రాంగం సాగిస్తున్నారు . ఈ వ్యవహారం అధికారపార్టీలో దడ పుట్టిస్తుంది.
భారీ నిఘా నీడ ఉన్నా ...
ఒక పక్క కేంద్ర నిఘా బృందాలు , మరోపక్క రాష్ట్ర ఇంటిలిజెన్స్ బృందాల గస్తీ చిన్నమ్మ చుట్టూ వున్నా ఆమె ఆపరేషన్ స్టార్ట్ చేశారని దినకరన్ వర్గాలు అంతర్గతంగా అనుకుంటున్నాయి. ఇప్పుడు వున్న స్థితిలో ఏ కొంతమందిని తనవైపునకు లాగినా ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం . గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ టిక్కెట్లు చిన్నమ్మ తన వారికే ఇప్పించుకున్నారు. పన్నీరు తోక జాడించడంతో ఆయన్ను బలవంతంగా చిన్నమ్మ రాజీనామా చేయించారు. జైలు కి పోతు పోతూ నమ్మిన బంటు పళని ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఇక అంతా సజావుగా ఉందని భావించిన నేపథ్యంలో ఆమె జైలుకు పోగానే పన్నీరు పళని ఏకమయ్యారు. చిన్నమ్మ వర్గానికి ఊహించని షాక్ ఇద్దరు ఇచ్చి దినకరన్ ను పార్టీ నుంచి గెంటేసి సీన్ రివర్స్ చేశారు.
ప్రభుత్వం ఆమె పెరోల్ రద్దు చేయిస్తుందా ..?
సమయం చాలా తక్కువ వుంది. ఈ ఐదు రోజుల వ్యవధిలో చిన్నమ్మ ప్రభుత్వాన్ని కూల్చే బలం పోగేసుకోవడం చాలా కష్టమైన పనే. ఆమెపై నిఘా నేత్రాలు చుట్టూ కమ్ముకుని వున్నాయి . ఏమాత్రం కోర్టు ఇచ్చిన నిబంధనలు ఉల్లఘించినా బెంగుళూర్ జైలు కి చిన్నమ్మ ముందుగానే వెళ్ళలిసి వస్తుంది. పెరోల్ నిబంధనల తీవ్రత కారణంగానే ఆమెను కలిసేందుకు సైతం ఎమ్యెల్యేలు జంకుతున్నారు . ఈ నేపథ్యంలో చిన్నమ్మ సాధించేది ఏది ఉండదని కానీ పరిస్థితిని స్వయంగా అంచనా వేసి జైల్లో వ్యూహం రూపొందించి అమలు చేస్తారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా జయ లలిత మరణం నుంచి తమిళనాడులో పాలిటిక్స్ దేశ వాసులందరిలో ఆసక్తి పెంచేశాయి.