భర్త నటరాజన్ మృతి చెందడంతో శశికళ పెరోల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తంజావూరు దాటి వెళ్లకూడదనది షరతులు విధించింది. అంతేకాదు ఎలాంటి రాజీకీయ పార్టీల సమావేశంలో పాల్గొనరాదని, మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు విధించారు. పెరోల్ పై బయటకు వచ్చిన శశికళ ప్రస్తుతం తంజావూరులోనే ఉంటున్నారు. నటరాజన్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఒక రోజంతా మౌనంగా రోదించిన ఆమె ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా దినకరన్, దివాకరన్ లతో ఎక్కువ సేపు సమావేశమై భవిష్యత్ వ్యూహాలపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.
భవిష్యత్ పై కార్యాచరణ....
శశికళ కుటుంబం మొత్తాన్ని అన్నాడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే దినకరన్ వెంట 19 మంది ఎమ్మెల్యేలున్నారు. వారంతా శశికళను ఒక్కొక్కరుగా వచ్చి కలుస్తున్నారని చెబుతున్నారు. శశికళ ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై వ్యూహరచన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి శశికళ శిక్షాకాలం పూర్తి చేసుకుని బయటకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పార్టీని పెట్టారు. జైలులో ఉన్న శశికళ అనుమతి తీసుకునే దినకరన్ ఈపార్టీ పెట్టారు.
కుటుంబ సభ్యుల్లో విభేదాలు....
అయితే కొత్త పార్టీలో పదవుల భర్తీపై శశికళ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్లు వార్తలొచ్చాయి. దివాకరన్ తో పాటు వివేక్ వంటి వారు తమకు కీలక పదవులు కావాలని పట్టుబడుతున్నారు. అయితే దినకరన్ మాత్రం కొత్త పార్టీపై కూడా మన్నార్ గుడి మాఫియా ముద్ర పడుతుందని వెనకంజ వేస్తున్నారు. దీనిపై కూడా శశికళ కుటుంబసభ్యులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టకముందే వీధిన పడితే ప్రజల్లో చులకన అవుతామని, ముందు పార్టీని బలోపేతం కానివ్వాలని, తర్వాత పదవుల సంగతి ఆలోచిద్దామని అందరికీ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలు మాత్రం వివేక్ చూసుకుంటారని శశికళ నిర్మొహమాటంగా దినకరన్ వద్దే చెప్పినట్లు సమాచారం.
శశికళ కదలికలపై నిఘా....
గతంలో పెరోల్ పై బయటకు వచ్చినప్పుడు శశికళ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో తన భర్త నటరాజన్ ఆరోగ్యం బాగాలేదని పెరోల్ పై ఐదు రోజులు బయటకు వచ్చారు. అయితే అప్పట్లో నటరాజన్ ఉన్న ఆసుపత్రిలో కంటే ఎక్కువ సేపు తన వదని ఇళవరసి కూతురి ఇంట్లోనే రాజకీయ మంతనాలు సాగించారన్న విమర్శలు వచ్చాయి. పెరోల్ నిబంధనలు ఉల్లంఘిస్తే పెరోల్ రద్దవుతుందని కూడా అప్పట్లో అధికార పార్టీ నేతలు బెదిరించారు. అయితే ఇప్పుడు శశికళ కేవలం తంజావూరుకే పరిమితమయ్యారు. దినకరన్ తో పాటు ఉన్న ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ ఆ ఛాయలకు వెళ్లడం లేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తంజావూరులో ఇంటలిజెన్స్ అధికారులను రంగంలోకి దించింది. శశికళను ఎవరెవరు కలుస్తున్నారన్న విషయం ఆరాతీస్తోంది. శశికళ పెరోల్ పై సాక్షి సంతకం అన్నడీఎంకే ఎంపీ పెట్టారన్న వార్తలు రావడంతో పళనిస్వామి ప్రభుత్వం శశికళ కదలికలపై నిఘా ఏర్పాటు చేసింది.