చిన్నమ్మను అష్టదిగ్భంధనం చేసేస్తున్నారు. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి సగం చచ్చిపోయిన శశికళకు మరింత షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నకాలంలో శశికళ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. జయలలితకు తెలియకుండానే చిన్నమ్మ వందల కోట్ల ఆస్తులు మూటగట్టుకున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లతో సహా అన్ని నగరాల్లో ఆస్తులు కూడబెట్టారు. ఇక వ్యాపాలయితే చెప్పలేనన్నది. చిన్నమ్మ కుటుంబం మరో పది జనరేషన్లు చింత లేకుండా బతికేవిధంగా ఆస్తులు సంపాదించేశారు. అయితే అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న శశికళ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పెరోల్ పై వచ్చిన చిన్నమ్మ తనకు నమ్మకం ద్రోహం చేసిన పళనిస్వామిని గద్దె దించేంతవరకూ నిద్రపోననని శపథం చేసి మరీ వెళ్లారు.
ఆస్తులన్నీ జప్తు చేస్తే....
ఈ సమయంలో చిన్నమ్మ, ఆమె కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వం నజర్ పెట్టింది. శశికళ కుటుంబం అక్రమ ఆస్తులను సీజ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయంటున్నారు. శశికళ కుటుంబసభ్యులు బోగస్ కంపెనీలను నడుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు గుర్తించారు. వీటిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. శశికళపై పగ తీర్చుకోవడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అని వెయిట్ చేస్తున్న పళనిస్వామి కేంద్రం ఆదేశాలతో చిన్నమ్మ ఆస్తులను జప్తు చేయించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం పళనిస్వామి ఉన్నతాధికారులతో భేటీ అయి ఈవిషయమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. శశికళ ఆస్తులన్నింటినీ జప్తు చేయగలిగితే ఆమె ఇక ఇప్పట్లో కోలుకోలేదని, వచ్చే ఎన్నికల నాటికి చిన్నమ్మ కుటుంబం కనుమరుగైపోతుందని పళని, పన్నీర్ సెల్వం ఆలోచనగా ఉంది.