వ్యూహం ఎలా ఉండాలంటే?

Update: 2018-03-03 04:30 GMT

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ అధినేత జగన్ నేడు నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే మార్చి 5వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఢిల్లీలో పెద్దయెత్తున ధర్నా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 21వ తేదీన బీజేపీపై అవిశ్వాసం పెడతామని వైసీపీ ప్రకటించింది. అయితే వైసీపీ అవిశ్వాస తీర్మానంపై ఎలా ముందుకు వెళ్లాలనేది నేడు నేతలతో జగన్ చర్చించనున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

యాభై మంది సభ్యుల మద్దతు....

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలంటే కనీసం యాభై మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే వైసీపీకి కేవలం ఐదురుగు సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మిగిలిన పార్టీలతో అవిశ్వాసంపై మార్చి 5వ తేదీ నుంచి చర్చలు జరపాలని జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 198 నిబంధనను అనుసరిస్తూ వైసీపీ పెట్టే అవిశ్వాస తీర్మానంపై తొలుత పొరుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలతో సంప్రదించాలని జగన్ సూచించే అవకాశముంది.

పొరుగు రాష్ట్రాల పార్టీలతో......

తెలంగాణ రాష్ట్ర సమితి, తమిళనాడులోని అన్నాడీఎంకే, డీఎంకే, కర్ణాటకలోని జేడీఎస్ పార్టీలతో తొలుత సంప్రదించి అవిశ్వాసానికి మద్దతు కోరాలని జగన్ భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్దతు తీసుకుంటే మంచిదని జగన్ భావిస్తున్నారు. తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలను కూడా సంప్రదించనున్నారు. అవిశ్వాసం వైసీపీ పెట్టి ఉపయోగం లేదని అనిపించుకోకుండా ఖచ్చితంగా యాభై మంది సభ్యుల మద్దతు కూడగట్టాలని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జరిగే పార్టీ నేతల సమావేశంలో జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Similar News