ఈ నేత వైసీపీలో చేరదామనుకున్నారు. కాని అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో టీడీపీ వైపు చూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే సమయంలో లీడర్లు తమకు కంఫర్ట్ అయిన పార్టీ కోసం... ప్లేస్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలమైన సీటు ఇచ్చే పార్టీలో చేరిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో ఎటువంటి బేషజాలకు పోవడం లేదు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ మారడం పై నేతలు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తమకు ప్రత్యర్థి లేనటువంటి పార్టీలోకి వెళ్లేందుకు ప్రణాళిక రచించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టిక్కెట్ సంపాదించి ఎమ్మెల్యేగా గెలవాలని తపన పడుతున్నారు.
పంతం బాటలో అనేక మంది.........
ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పంతం నానాజీది కూడా అదే పరిస్థితి. పంతం నానాజీ ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆయన తొలుత వైసీపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. పంతం నానాజీ కాకినాడ టిక్కెట్ పై ఆశలు పెట్టుకుని వైసీపీలోకి వెళదామనుకున్నారు. అయితే అప్పటి వరకూ అనపర్తి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పై కన్నేశారు. కాకినాడ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. దీంతో పంతం నానాజీ ఆశలు గల్లంతయ్యాయి. పంతం నానాజీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కాకినాడలోనే ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కాకినాడలో ఉన్న సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వరన్న టాక్ బలంగా ఉంది. ఆ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వకుంటే తనకే దక్కుతుందని పంతం నానాజీ భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ జిల్లా నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు కూడా అదే బాటలో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఎన్నికల దగ్గర పడే కొద్దీ తమకు సీటు ఇచ్చే పార్టీలోకే వెళ్లాలని నేతలు నిర్ణయించుకుని ఆ దిశగా తమ ప్రయత్నాలు ప్రారంభించారు.