వైసీపీలో టిక్కెట్ల గోల షురూ..!

Update: 2017-10-27 10:30 GMT

పాదయాత్ర చేపడుతున్న జగన్ కు నియోజకవర్గాల్లో కుమ్ములాటలు ఆటంకంగా మారేటట్లు కన్పిస్తున్నాయి. టిక్కెట్ల కోసం కొందరునేతలు అప్పుడే జగన్ పై వత్తిడి తేవడం ప్రారంభించారు. గురువారంజరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అయిన తర్వాత జగన్ తో భేటీ అయిన కొందరు తమ టిక్కెట్ల మాటేమిటని ప్రశ్నించారు. ‘ఇంకా టైముంది కదన్నా...చూద్దాం’అంటూ జగన్ మాట దాటవేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంపై కన్ఫ్యూజన్ ఉంది. కావలి నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఎందరుఎమ్మెల్యేలు పార్టీ మారినా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాత్రం వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే ఇక్కడ అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి కావలి టిక్కెట్ తనకే కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. గతకొంతకాలంగా కావలిలోనే తాను కూడా ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేసుకుని మరీ విష్ణువర్ణన్ రెడ్డి తన అనుచరులతో కలియ తిరుగుతున్నారు.

కావలి టిక్కెట్ పై రగడ....

అయితే గత ఎన్నికల్లోనే కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో దానిని జగన్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి ఇచ్చేశారు. అయితే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కాటంరెడ్డికి అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. కాని పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆ హామీని జగన్ నెరవేర్చుకోలేకపోయారు. దీంతో కాటంరెడ్డి ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్ తనకే కావాలని పట్టుబడుతున్నారు. ఈమధ్య జగన్ ను కలిసి తన ఆవేదనను వెళ్లగక్కారు. జగన్ నుంచి హామీ లభించిందని తన అనుచరులతో కాటంరెడ్డి చెప్పుకున్నారు.దీంతో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గురువారం జరిగిన సమావేశం అనంతరం జగన్ ను కలిసి తనకు టిక్కెట్ పై క్లారిటీ కావాలనికోరారని తెలిసింది. అయితే ఇంకా టైం ఉంది కదా అని జగన్ దాటవేసినట్లు సమాచారం. అలాగే అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒకరికి ముగ్గురు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద పాదయాత్ర చేపడుతున్న జగన్ కు టిక్కెట్లు హామీ ఇవ్వకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవని పార్టీ నేతలే అనుకుంటున్న పరిస్థితి.

Similar News