వైసీపీలో అక్కడ ఆయన మాటే శిలాశాసనం

Update: 2017-10-20 15:00 GMT

ఎవరైనా పార్టీలో వస్తానంటే రా...రమ్మని స్వాగతం పలుకుతారు. పార్టీ కండువాను కప్పుతారు. పార్టీని బలోపేతం చేయడానికి ఏ నేతనైనా ఆహ్వానించడం ప్రతి పార్టీలో జరుగుతున్నదే. కాని వైసీపీలో ఈ జిల్లాలో మాత్రం అంతా ఆయనిష్టమే. ఆయన అనుమతిస్తేనే పార్టీలోకి రావాల్సి ఉంటుంది. లేకుంటే లేనట్లే. ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఇది. ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ధీటుగానే సీట్లను కొల్లగొట్టగలిగింది. అలాంటి ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి జగన్ దగ్గర బంధువు వైవీ సుబ్బారెడ్డి తనకు ఇష్టం లేని వారిని అసలు పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కడం లేదట. ప్రకాశం జిల్లాలో అనేకమంది నేతలు వైసీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా కనిగిరి, కందుకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, మహీందర్ రెడ్డి లాంటి నేతలు జగన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు.

చేరికలను అడ్డుకుంటున్న వైవీ......

కాని వైవీ మాత్రం మోకాలడ్డుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వైవీ నియంత పోకడల వల్లనే ఇప్పటికే జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వాస్తవానికి టిక్కెట్ల విషయాన్ని అధినేత చూసుకుంటారు. ప్రశాంత్ కిషోర్ టీం సర్వే కూడా జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక ఇప్పుుడు కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వైవీ మాత్రం వీటన్నింటిని లెక్క చేయడంలేదు. జిల్లాలో తాను టిక్ పెట్టిన వారికే టిక్కెట్ అని చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీలో చేరతామని వస్తున్న నేతలను కూడా తిప్పించుకుంటున్నారు. ఈ విషయం అధినేత దృష్టికి కూడా వెళ్లిందట. జగన్ ప్రశ్నిస్తే వారు వస్తే ఇలాంటి సమస్యలు వస్తాయని జగన్ కు వివరణ ఇవ్వబోయారట. అందుకే ప్రకాశం జిల్లా నేతలు ఇప్పుడు వైవీని కాదని... విజయసాయి రెడ్డిని కలుసుకుంటున్నారట. ఇద్దరు నేతలు ఇప్పటికే విజయసాయి రెడ్డి వద్దకు వచ్చి తమ చేరిక విషయాన్ని చెప్పడంతో పాదయాత్రలో చేరితే బాగుంటుందని సూచించారట. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి పెత్తనంపై సొంత పార్టీనేతలే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News