వైసీపీకి బెజ‌వాడ‌లో కోలుకోలేని దెబ్బ తగలనుందా?

Update: 2018-01-11 12:30 GMT

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కులరాజ‌కీయాలు కీల‌కంగా మారాయి. విభ‌జ‌న త‌ర్వాత కాపు సామాజిక వ‌ర్గ ప్ర‌భావం రాష్ట్ర రాజ‌కీయాల‌ను మారుస్తోంది. ఈ నేప‌థ్యంలో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ.. ఈ సామాజిక‌వ‌ర్గాన్ని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. రాజ‌కీయ కార‌ణాలేమైనాగానీ.. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ కల్పిస్తూ ఏపీ సీఎం చంద్ర‌బాబు సాహ‌సోపేత నిర్ణ‌య‌మే తీసుకున్నారు. అంతేగాక ఇప్పుడు విజ‌య‌వాడ‌లో కాపు సామాజిక‌వ‌ర్గానికి కీల‌కంగా ఉన్న మ‌రో ముఖ్య నాయ‌కుడు, వైసీపీ నేత వంగ‌వీటి రాధను సైకిలెక్కించేందుకు పావులు క‌దుపుతున్నారు. వైసీపీలో ఆయ‌న‌కు స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డం, పార్టీలోని నేత‌ల మ‌ధ్య విభేదాల నేప‌థ్యంలో.. పార్టీ మారడంపై ఆయ‌న స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది!

రాధాను లాగేసుకునేందుకు....

వైసీపీకి రాజ‌ధాని ప్రాంతంలో ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! ముఖ్యంగా కాపు సామాజికవ‌ర్గానికి చెందిన వంగ‌వీటి రాధ కొద్ది కాలం నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌టంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో కాపుల‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి కావాల‌ని ఉద్య‌మించిన వారిలో వంగవీటి రంగా పేరు ముందు వరుస‌లో ఉంటుంది. ఇప్ప‌టికీ కాపుల్లో ఆయ‌నపై ప్ర‌త్యేక అభిమానం ఉంది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌కు కీల‌కంగా మారిన విజ‌య‌వాడ‌లో ఆయ‌న పేరు చిర‌స్థాయిగా నిలిచిపోయింది. ఆయ‌న మ‌ర‌ణించి దాదాపు మూడు ద‌శాబ్దాలైనా కాపు సామాజిక వ‌ర్గంలో ఆయ‌న ఇంకా గుర్తుండిపోయారు.

రాధాతో మంతనాలు....

రంగా వార‌సుడిగా వంగ‌వీటి రాధ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి, అంత‌కుముందు పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలో ఉన్నాస‌రే.. పెద్ద‌గా క్రియాశీలకంగా లేరు. న‌గ‌ర పార్టీ బాధ్య‌త‌ల నుంచి ఆయ‌న్ని త‌ప్పించిన త‌రువాత మ‌రింత డీలా ప‌డ్డార‌ని చెబుతున్నారు! ఆయ‌న పార్టీ బాధ్య‌త‌ల్ని స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌లేక‌పోయార‌నే కారణంతోనే వైసీపీలో రాధ‌కు ప్రాధాన్య‌త త‌గ్గింద‌నేది మ‌రికొంద‌రి వాద‌న‌! వైసీపీలో ఈ మ‌ధ్య కాలంలో కొంత‌మంది నేత‌లు చేర‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున రాధ‌కు ఎక్క‌డ అవ‌కాశం ఇస్తార‌నే స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో అసంతృప్తితో ఉన్నార‌ట‌. ఈ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీ అంటే కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన పార్టీ కాద‌ని చెప్పేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ప్రాంతాల‌వారీగా ప్ర‌ముఖ సామాజిక వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్నారు. కొద్దిరోజులుగా టీడీపీ ఆహ్వానం అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్నా… దీనిపై ప్ర‌స్తుతం రాధ మౌనంగానే ఉంటున్నార‌ని స‌మాచారం. మ‌రి టీడీపీ ప్ర‌య‌త్నాలు ఎంత మేర‌కు ఫ‌లిస్తాయో వేచిచూడాల్సిందే!!

Similar News