వైసీపీ లేని లోటు బీజేపీ పూడుస్తుందా?

Update: 2018-03-03 11:30 GMT

ఈ నెల 5వ తేదీ నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొనేలా ఉంది. బడ్జెట్ సమావేశాలు కావడంతో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఎక్కువ రోజులే సమావేశాలు జరిగే అవకాశముంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం శానససభను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేవరకూ తాము శాసనసభలోకి అడుగుపెట్టబోమంటూ నిర్ణయించింది. ఇక శాసనసభలో అధికార తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షమై బీజేపీ మాత్రమే ఉన్నాయి.

వైసీపీ గైర్హాజరుతో....

గత శాసనసభ సమావేశాల్లో బీజేపీ కొంత ప్రతిపక్ష పాత్ర పోషించింది. అప్పుడు కూడా వైసీపీ సభకు హాజరు కాలేదు. అయితే ఈసారి పరిస్థితులు మారిపోయాయి. రెండు పార్టీలూ కారాలు, మిరియాలు నూరుకుంటున్నాయి. పార్లమెంటులో బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. సభా కార్యక్రమాలను స్థంభింప చేయాలన్న నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ శాసనసభలో కూడా తాము ఏం చేయాలన్న దానిపై బీజేపీ నేతలు విశాఖలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. బీజేపీ జాతీయ నేత సతీష్ జీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

విశాఖలో సమావేశం.....

అయితే టీడీపీపై బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. టీడీపీ అన్ని పార్టీలతో కలిసి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. తప్పుడు ప్రచారాన్ని తీసుకెళుతూ ప్రజలను తప్పదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఓట్లనుఎలా రాబట్టుకోవాలో టీడీపీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అని ఎద్దేవా చేశారు. లేనిది ఉన్నట్లు చెప్పడంలో టీడీపీది అందె వేసిన చేయి అని అన్నారు. అంతేకాదు చంద్రబాబును ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా విమర్శించారు. ఇదే సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ ఏపీకి కేంద్రం సాయం ఏం చేసిందీ? చేయబోయేది ప్రజలకు వివరిస్తామన్నారు.

వెనుకబడిన ప్రాంతాలపై.....

శాసనసభ సమావేశంలో ప్రజాసమస్యలను లేవనెత్తాలని నిర్ణయించారు. కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి ఏం చేసిందో సభా ముఖంగా అవకాశమిస్తే వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. కేవలం సెంటిమెంట్ నే లక్ష్యంగా చేసుకుని అభివృద్ధిని ఒక ప్రాంతానికే పరిమితం చేయడంపైనా బీజేపీ ఆక్షేపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ సమస్యలను సభలో లెవనెత్తాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ లేని లోటును బీజేపీ పూడ్చాలని చూస్తున్నట్లు కన్పిస్తోంది. మరి మార్చి 5వ తేదీ నాడు బీజేపీ, టీడీపీ చర్చలు ఫలిస్తే మాత్రం మిత్రపక్షంగానే వ్యవహరించే అవకాశముంది. లేకుంటే ప్రతిపక్ష పాత్రనే పోషించాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు.

Similar News