వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వైసీపీ ముఖ్యనేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పాదయాత్రపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 10వ దేీన ప్రారంభం కానున్నాయి. జగన్ పాదయాత్ర వచ్చే నెల 6వ తేదీన ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. జగన్ పాదయాత్ర జరిగే సమయంలో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రశాంత్ కిషోర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమై ఏ ఏ నియోజకవర్గాలకు ఏ తేదీన చేరుకుంటుందీ...? పాదయాత్రకు ముందు నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాదయాత్ర చేరుకున్న తర్వాత నియోజకవర్గంలో పార్టీ ఏం చేయాలన్నదానిపై ప్రశాంత్ కిషోర్ ఈరోజు నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు. ప్రతిశుక్రవారం జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో ఆ రోజు మినహాయించి పాదయాత్ర రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు.
నేడు పాదయాత్ర, అసెంబ్లీపై స్పష్టత....
ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా? అన్న దానిపై కూడా నేడు సమావేశంలో స్పష్టత రానుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని అనేకమంది వైసీపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశముంది. తాను పాదయాత్రలో ఉండగా జరుగుతున్న సమావేశాలు కావడంతో తన బదులు వేరే వారికి ప్రతిపక్ష నేత బాధ్యతలను అప్పగించే అవకాశముందని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఇటీవల కాలంలో నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలు, పోలవరం పనులు ఆలస్యం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులకు నష్ట పరిహారం అందించడం, చంద్రబాబు విదేశీ పర్యటన వంటి విషయాలపై చర్చించాలని వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా జగన్ ఆలోచిస్తున్నారు. దీనిపైన కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. శాసనసభ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే వ్యూహాన్ని ఈ సమావేశంలోనే రచించనున్నారు. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ పాదయాత్రకు సంబంధించి పూర్తి స్థాయి రూట్ మ్యాప్ ను ఈరోజు నేతల ముందుంచనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని కూడా ప్రశాంత్ కిషోర్ వివరించనున్నారు.