వైసీపీ లీడర్లకు ఈ టెన్షన్ ఏంటి?

Update: 2017-11-30 10:30 GMT

టీడీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీలోని పెద్దతలకాయ త్వరలో చేరుతున్నట్లు చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చెన్నాయుడు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై రకరకాలు కథనాలను వండి వారుస్తున్నారు. వైసీపీని వీడే వారిలో బొత్స సత్యనారాయణ, శ్రీకాంత్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఆయన కాంగ్రెస్ లో పదేళ్ల పాటు మంత్రి పదవులను అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన వెళ్లదలచుకుంటే అప్పుడే టీడీపీలోకి వెళ్లేవారని, ఇప్పుడు వైసీపీని వీడే ప్రసక్తి లేదని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో ప్రముఖంగా విన్పిస్తోంది. అయితే ఆయన తాజాగా మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించారు. తనతో మాట్లాడిన టీడీపీ నేతలు ఎవరో వారు మీడియా ముందుకు దమ్ముంటే రావాలని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మేకపాటి పై కూడా....

నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన దీన్ని తీవ్రంగా ఖండించారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరవిధేయుడినని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారబోననిచెబుతున్నారు. ఇక నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మేకపాటిరాజమోహన్ రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి వస్తే ఆయన కుమారుడు, ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి కూడా టీడీపీలోకి వస్తారని, ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. అయితే మేకపాటి సాధారణంగా మీడియా సమావేశాల్లో ఎక్కువగా కన్పించరు. ఆయనవైసీపీ అధినేత జగన్ కు అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇటీవలే ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రధానినరేంద్ర మోడీకి కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో మేకపాటి పార్టీని వీడబోరని వైసీపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. జగన్ పాదయాత్రను చూసి ఓర్వలేక టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుందని, ఆ ఉచ్చులో ఎవరూ పడవద్దని వైసీపీ నేతలు కోరుతున్నారు.

Similar News