వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. వైసీపీ నుంచి టీడీపీలోకి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వీరందరిపై అనర్హత వేటు వేస్తేనే తాము శాసనసభలోకి అడుగుపెడతామని వైసీపీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నలుగురు మంత్రులతో పాటు మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నది వైసీపీ ప్రధాన డిమాండ్. వారిపై చర్యలు తీసుకోకుంటే తాము శాసనసభలో అడుగుపెట్టబోమని గట్టిగా చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
వైసీపీకి కౌంటర్ ఇవ్వకపోవడంపై....
వైసీపీ శాసనసభ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదని వారిని ప్రశ్నించినట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా మంత్రులు కూడా మిన్నకుండిపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మంత్రుల్లో వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి ఒక్కరే వైసీపీకి కౌంటర్ ఇచ్చారని, ఆదినారాయణరెడ్డి కౌంటర్ కూడా కన్ ఫ్యూజన్ గా ఉందని బాబు అభిప్రాయపడినట్లు తెలిసింది. మంత్రులు అఖిలప్రియ, అమర్ నాథ్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావులు ఈ విషయంపై ఏమీ మాట్లాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి వచ్చి మంత్రి పదవి చేపట్టిన మీరే కౌంటర్ ఇవ్వకుంటే ఇక ఎవరిస్తారని ఆయన అన్నట్లు తెలిసింది. వైసీపీ శాసనసభ బహిష్కరణ నిర్ణయం ప్రకటించిన వెంటనే మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి లాంటి వారు మాత్రమే స్పందించారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత యనమల రెస్పాండ్ అయ్యారు. అంతే తప్ప వైసీపీ నుంచి వచ్చిన మంత్రులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రాష్ట్రపతికి కూడా లేఖ రాశారని, అప్పుడైనా మాట్లాడాల్సిందని ఆయన వారి పనితీరును తప్పు పట్టినట్లు సమాచారం. దీంతో వైసీపీ నుంచి వచ్చి మంత్రులయిన వారు మౌనంగా ఉండిపోయారట.