జగన్ పాదయాత్రకు రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ పాదయాత్రకు ప్రజాసంకల్పంగా నామకరణంచేశారు. ఈరోజు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆరు నెలల పాటు 13 జిల్లాలో 125 శాసనసభ నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ పాదయాత్రకు వైసీపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది. ప్రతి శుక్రవారం జగన్ పాదయాత్రకు బ్రేక్ ఉంటుంది. అయితే పాదయాత్ర జరిగే సమయంలో ఏం చేయాలన్న దానిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోపాటు వైసీపీ అధినేత జగన్ కూడా పార్టీనేతలకు సూచనలు అందించారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జులు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో దిశానిర్దేశం చేశారు.
పాదయాత్ర జరిగే సమయంలో....
పాదయాత్ర జరిగే సమయంలో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో కార్యక్రమాలను రూపొందించారు. ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 30 గ్రామాలను ఎంపక చేశారు. ఈ ఎంపిక చేసిన గ్రామాల్లో ఆ నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, పోలింగ్ బూత్ నేతలు పల్లె నిద్ర చేయాల్సి ఉంటుంది. ఉదయమంతా గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకుని రాత్రి ఆ గ్రామంలోనే బస చేయాలి. ఉదయం గ్రామం నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ వైసీపీ జెండా పాతాల్సి ఉంటుంది. ఇక నియోజకవర్గంలోని రెండు కళాశాల్లో విధిగా యువభేరిని నిర్వహించాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదాపై నియోజకవర్గ ఇన్ ఛార్జులే ఎంపిక చేసిన కళాశాలల్లో యువభేరిని జరపాలని నిశ్చయించారు. అంతేకాకుండా నియోజకవర్గ సమస్యలపై ఆందోళనలను ప్రజల సహకారంతో నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం మీద జగన్ పాదయాత్రపై నేతలకు పూర్తిక్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన ఏ ఏ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించేది వివరించారు. మొత్తం మీద పల్లెనిద్ర పేరిట వైసీపీ నేతలకు జగన్ కఠిన పరీక్షే పెట్టారు.