2019 ఎన్నికలు సమీపిస్తున్నారు. ఈ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఏపీలో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్.. ప్రస్తుత అధికారాన్ని తిరిగి నిలబెట్టకోవాలని చంద్రబాబు ఇలా ఎవరికివారు భారీస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియా దన్ను కూడా అవసరమని ఇద్దరూ భావిస్తున్నారు. జగన్‌కు ఇప్పటికే మీడియా ఉన్నా.. ఆ ఒక్కటీ చాలదని డిసైడ్ అయిన ఆయన.. మరో టీవీ ఉంటే మేలని భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుకుఅనుకూలమైన కొన్ని ఛానెళ్లు ఉన్నా కూడా.. ఆయన కూడా మరో టీవీ ఉంటేనే తప్ప పరిస్థితి అనుకూలంగా మారదని భావిస్తున్నారు.
ముహూర్తం రెడీ....
ఈ నేపథ్యంలోనే కొన్ని కొత్త ఛానెళ్లు తెలుగు గడపల్లోకి ప్రవేశించేందుకు ముహూర్తాలు నిర్ణయం అయిపోయాయి. ఇప్పటికే బాబుకు అనుకూలంగా ఉండే ఏపీ 24/7 ఛానెల్ ప్రారంభమైపోయింది. ఇక, ఇప్పుడు.. వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని)తో కలసి ఎన్టీవీ చౌదరి, టీవీ9 సీఈవో రవిప్రకాష్ కొత్త ప్రాజెక్టు ప్రారంభించారు. ఆ సంస్థ పేరే 11 ఈవెన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. పది లక్షల రూపాయల అధీకృత మూలధనంతో కూడిన ఈ కంపెనీ..పెయిడ్ అప్ క్యాపిటల్ లక్ష రూపాయలుగా ఉంది. ఈ సంస్థ స్పోర్టింగ్, ఇతర రిక్రియేషనల్ కార్యకలాపాల్లో నిమగ్నం కానుంది.
కొడాలి నాని కూడా....
ఈ విషయం రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ వోసీ) నివేదికలో ఉంది. 2017 మార్చి15న ఈ కంపెనీని నెలకొల్పారు. సినిమా రంగాన్ని టార్గెట్ చేసుకుని..వీరు కొత్త ఛానల్ ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు ( నాని) సినీ నిర్మాత అన్న సంగతి తెలిసిందే. గతంలో పలు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. రాబోయే రోజుల్లో ఎంటర్ టైన్ మెంట్ రంగానికే ప్రాధాన్యత ఉంటుందనే ఉద్దేశంతో వీరు మందుకు కదులుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిని ఎంటర్‌టైన్ మెంట్‌కే ప్రారంభిస్తున్నట్టు సమాచారం ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. పొలిటికల్ ప్రచారానికి కూడా వినియోగించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.