వైసీపీ నేత పార్టీకి గుడ్ బై...! సైకిల్ తో హాయ్ హాయ్..!

Update: 2017-11-30 00:30 GMT

మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డి పార్టీలో మరికొద్ది సేపట్లో చేరుతున్నారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కనున్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డి అనంతపురం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పనిచేశారు. అయితే ఆయనను జగన్ ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించి పార్టీ సెంట్రల్ కమిటీలో చోటుకల్పించారు. దీంతో గురునాధరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అనంతపురంలో జరిగిన యువ భేరికి కూడా గురునాధరెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీని వీడుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన అనుచరులతో అమరావతికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. దీంతో అనంతపురం రాజకీయాలు వేడెక్కనున్నాయి. గురునాధరెడ్డి చేరికపై అసంతృప్తిగా ఉన్న అనంతపురం అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని చంద్రబాబు పిలిపించుకుని మరీ మాట్లాడి ఆయనకు భరోసా కల్పించారు. అయితే ఇప్పటికీ గురునాధరెడ్డి పార్టీలో చేరడాన్ని టీడీపీలో కొందరు వ్యతిరేకిస్తున్నారు.

మరికాసేపట్లో చంద్రబాబు సమక్షంలో....

అనంతపురం నియోజకవర్గంలో గురునాధరెడ్డికి పట్టుంది. అందుకోసమే గురునాధరెడ్డి చేరికకు చంద్రబాబు అంగీకరించారు. గురునాధరెడ్డితో పాటునలుగురు కార్పొరేటర్లు, కొన్ని డివిజన్ల వైసీపీ ఇన్ ఛార్జులు టీడీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గురునాధరెడ్డి అనంతపురం నియోజకవర్గంలో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ అనంతపురం ఇన్ ఛార్జిగాజగన్ నియమించడంతో పార్టీ కార్యక్రమాల్లో కొంతకాలం చురుగ్గా పాల్గొన్నారు. అయితే వైసీపీ అధినతే జగన్ మైనార్టీ నాయకుడు అహ్మద్ నదీంను ఇన్ ఛార్జిగా నియమించడంతో విభేదాలు వీధిన పడ్డాయి. తనను తప్పించడంపై గురునాధరెడ్డి వర్గం గుర్రుగా ఉంది. పార్టీ సమావేశంలోనూ వారు రచ్చరచ్చ చేశారు. అయితే గురునాధరెడ్డికి పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలో చేరేందుకు ఈ ముగ్గురు నేతలతో చర్చలు జరిపారు. గురునాధరెడ్డి సోదరులిద్దరూ పార్టీలో చేరుతున్నారు. జేసీ అండతోనే ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆగ్రహంతో ఉన్నారు. అయితే అధినేత పిలిచి పరిస్థితిని వివరించేసరికి చౌదరి మెత్తబడ్డారు. ఇప్పటికే అనంతపురంలో టీడీపీ వర్గాలుగా విడిపోయి విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గురునాధరెడ్డి చేరికతో ఇవి మరింత ముదిరే అవకాశముంది.

Similar News