ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు అనంతపురం పంచాయతీ చేరుకుంది. ఈరోజు ముఖ్యమంత్రిని అనంతపురం శాసనసభ్యుడు ప్రభాకర్ చౌదరి కలిశారు. వైసీపీ నేత గుర్నాధ రెడ్డిని పార్టీలోజరుగుతున్న ప్రచారంపై ప్రభాకర్ చౌదరి చంద్రబాబును కలిశారు. అయితే చంద్రబాబు ఆ ప్రచారం వాస్తవమేనని అంగీకరించారు. పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకే గురునాధరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పారు. గురునాధ రెడ్డి వస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా మీకే ఇస్తానని చంద్రబాబు ఆయనకు భరోసా ఇచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు అయితే తనకెలాంటి అభ్యంతరం లేదని ప్రభాకర్ చౌదరి చంద్రబాబుకు తెలిపారు.
రేపు గురునాధరెడ్డి టీడీపీలో చేరిక....
అయితే వ్యాపార ప్రయోజనాలకోసమే గురునాధరెడ్డి పార్టీలోకి వస్తున్నట్లు జిల్లాల్లో ప్రచారం జరుగుతుందని ప్రభాకర్ చౌదరి చంద్రబాబుకు వివరించారు. ముఖ్యంగా మిస్సమ్మ బంగ్లా స్థలం విషయంలో తనకు అనుకూలంగా మలచుకోవడానికే గురునాధరెడ్డి పార్టీలోకి వస్తున్నారని ప్రభాకర్ చౌదరి చెప్పగా అందుకు చంద్రబాబు మాత్రం మిస్సమ్మ బంగ్లా విషయంలో చట్టం తనపని తాను చేసుకుబోతుందని, ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోదని చెప్పారు. అంతేకాకుండా గురునాధరెడ్డి వచ్చి పార్టీలో చేరినా ఆయన మీ నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుందని కూడా తెలిపారు. దీంతో గురునాధరెడ్డి పార్టీలో చేరినా... టిక్కెట్ రాదు... మిస్సమ్మ బంగ్లా విషయంలోనూ అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించదని తేలిపోయింది. కాకుంటే డిసెంర్ మొదటి వారంలో జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో ప్రారంభంకాబోతోంది. ఆయన జిల్లాలోకి ప్రవేశించకముందే గురునాధరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కన్పిస్తోంది. మొత్తం మీద గురునాధరెడ్డి చేరినా ప్రభాకర్ చౌదరి నాయకత్వంలోనే పనిచేయాల్సి రావడం, టిక్కెట్ పై హామీ లభించదన్న విషయం తేలిపోయింది. మరి గురునాధరెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి. గురువారం గురునాధరెడ్డి టీడీపీలో చేరే అవకాశముంది.